అమరావతి: మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలేనని ఎపి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వైసిపి పుట్టిందే అబద్ధాలపై అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఒక అపరిచితుడు అని జగన్ కుటుంబం చేసిన దారుణాలను పార్థశారధి రెడ్డి బయటపెట్టారని, ఆనాడు పులివెందులలో ఘటనలకు బాధ్యుడైన వారు ఇప్పుడు వైసిపిలో ఉన్నారని, రాజశేఖర్ రెడ్డి మరణంపై ఆనాడు కాంగ్రెస్ నాయకులు, బొత్స కూడా మాట్లాడారని, ఆనాడు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడారో.. అదే తాను చెప్పానని అన్నారు. తన తండ్రి చావుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కారణమని జగన్ ఆనాడు చెప్పారని, రిలయన్స్ సంస్థలపై ఆనాడు జగన్ అనుచరులు దాడులు చేశారని విమర్శించారు. వివేకానందరెడ్డి ఎలా చనిపోయారంటే చిన్న పిల్లాడు కూడా చెబుతాడని, గొడ్డలి పార్టీ అంటే జగన్ కు ఎందుకు అంతబాధ అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిందని, వైసిపి పాలనలో పరిపాలన గాడి తప్పిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలన గాడిలో పెట్టామని, కేంద్రం సహాయ సహకారాలతో అభివృద్ధి బాట పట్టామని అన్నారు. ఎవరూ రెండేళ్లలో ఊహించని విధంగా అభివృద్ధి చేశామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.