
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 2 లక్షల 50 వేల మంది పేద కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ భేటీ సుమారు మూ డుగంటల పాటు జరిగింది. పలు కీలక అంశాలపై మంత్రి మండలి చర్చించి నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీకి సంబంధించి రెవెన్యూ శా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులతో కలిసి మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాల ని కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణం ప్రారంభించి గోడలు, శ్లాబ్ దశల్లో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని రాష్ట్ర మం త్రివర్గం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపా రు.
పునాదులు పూర్తయి గోడలు, శ్లాబ్ పడని ఇళ్లకు రూ.3 లక్షలు, గోడలు పూర్తయి శ్లాబ్ ని లిచిపోయిన ఇళ్లకు రూ.2 లక్షలు చొప్పున అం దించాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన పే ర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల ను పూర్తి చేసేందుకు నియోజకవర్గానికి 500 ఇళ్లకు చొప్పున నిధులు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించిందని ఆయన తెలిపారు. తొలి విడత లో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లలో జూన్ రెండు నాటికి దాదాపు లక్ష ఇళ్ల గృహ ప్ర వేశాలు జరుగుతాయని మంత్రి పొంగులేటి తెలిపారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీలకు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1వ తేదీన ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించిందని, జూన్ 1వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులందరం ఈ కార్యక్రమంలో పాల్గొంటామని ఆయన పేర్కొన్నారు.
15 వేల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు
మహానగరం క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసం (ఎల్‌ఐజి) లక్ష ఇళ్లను నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీంతోపాటు ఎంఐజి ఇళ్లను 30 శాతం మంది పేదలకు నిర్మించి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. పేదలు నివసించే ప్రాంతంలోనే ఇళ్లు లేని వారికి ప్రత్యేకంగా భూములను ఎంపిక చేసి వారికి అక్కడ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో వివిధ దఫాలుగా చేసిన సర్వేల ప్రకారం 15 వేల కుటుంబాలు గుడిసెల్లో నివాసం ఉంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, వెంటనే ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించిందని,
గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని మంత్రివర్గం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఇళ్ల స్థలం లేని వారి కోసం అపార్ట్‌మెంట్ భూమిలో అన్‌డివైడెడ్ స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని, మూడు, నాలుగు విడతల్లో వాటిని పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే, అసంపూర్తిగా ఉన్న 500 ఇళ్లకు కూడా త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. సొంతంగా ఇళ్ల స్థలాలు ఉన్న వారికి రూ.5 లక్షలను మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
జూనియర్ కళాశాల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు
జూనియర్ కళాశాల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అల్ఫాహారం, పాలు అందించాలని మంత్రివర్గం ఆమోదించిందన్నారు. దీంతోపాటు కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని నూతన డిగ్రీ కళాశాలకు 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులు, 6 నాన్ టీచింగ్ పోస్టులు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 3 పోస్టులు, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఫైర్ స్టేషన్ కోసం 18 పోస్టుల మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు. దీంతోపాటు అస్సాం రైఫిల్స్, బిఎస్‌ఎఫ్, సిఐఎస్‌ఎఫ్ గ్రూప్ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెలిది గ్రామంలో 4 ఎకరాలు, చొప్పదండి మండలం రుక్మాపూర్లో 5 ఎకరాలు, గన్నేరువరం మండలంలో 5 ఎకరాలు మొత్తం 14 ఎకరాల భూమిని కేటాయింపునకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయన తెలిపారు.
గోదావరి పుష్కరాల కోసం తొలివిడతలో రూ.300 కోట్లు
అలాగే, 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి వివిధ పనులకు రూ.1,000 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించడంతో పాటు తొలి విడతగా రూ.300 కోట్లు మంజూరుకు అంగీకారం తెలిపిందని ఆయన పేర్కొన్నారు.విద్యుత్ పంపిణీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్‌డిఎస్‌ఎస్‌లో చేరేందుకు తెలంగాణ డిస్కంలు తయారు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆర్‌డిఎస్‌ఎస్‌లో చేరేందుకు గత ప్రభుత్వమే 2017 జనవరి 02వ తేదీన కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందని, ఆ ఒప్పందం మేరకే దానిని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఆర్‌డిఎస్‌ఎస్‌లో చేరినప్పటికి తాము ఎక్కడా వ్యవసాయ కనెక్షన్‌లకు మీటర్లు పెట్టాలని ఎక్కడా రాలేదని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని డిసిఎంఎస్‌లను మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని, టిజిఆర్‌ఐసిని (తెలంగాణ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) హాకాలో విలీనం చేయనున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు.
నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీకి ఆమోదం
పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ సేకరణ, పునరావాసం, మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు రూ.587 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు. తెలంగాణను 2030 నాటికి ప్రపంచంలోని టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్‌లో ఒకటిగా నిలబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని అందుకే నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026 30కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. దావోస్‌లో ఈ పాలసీని లాంఛనంగా ఆవిష్కరించామన్నారు. ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలతో పాటు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్, మెడికల్ ఇన్నోవేషన్ రంగాల్లో భారీ పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా మారుస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
యువతకు పరిశోధన, తయారీ, డిజిటల్ హెల్త్, గ్లోబల్ ఇన్నోవేషన్ రంగాల్లో మంచి అవకాశాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎక్కువగా తయారీ మీద దృష్టి ఉంటే, ఇక నుంచి విలువైన ఇన్నోవేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెడతామని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ యూనిట్లను కూడా పరిశ్రమలుగా గుర్తించే విధంగా ఈ పాలసీలో మార్పు తీసుకొస్తున్నామన్నారు. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్లు తెలంగాణకు రావడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు.











