
రేవంత్‌రెడ్డి గుంపు మేస్త్రీ కాదని, ముంపు మేస్త్రీ అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తండ్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మిలన్ గార్డెన్‌లో ఓటరు నమోదు (ఎస్‌ఐఆర్)పై జరిగిన బీఆర్‌ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కర్ణాటకలో ముగ్గురు ముఖ్యమంత్రులు ఏం మాట్లాడారో బహిర్గతం చేయాలని అలాగే కృష్ణా, గోదావరి జలాలు కాపాడాలని అడిగితే దీనిపై సమాధానం చెప్పకుండా తనపై, బీఆర్‌ఎస్ పార్టీపై సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పదేపదే తన ఎత్తుపై మాట్లాడటంతో పాటు పరుష పదజాలంతో రేవంత్ మాట్లాడుతున్నాడన్నారు. 2028లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పడం కాదు రేవంత్‌రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీని రద్దుచేసి తిరిగి ఎన్నికల బరిలో నిలిస్తే ప్రజలు ఎవరిని గెలిపిస్తారో స్పష్టమవుతుందన్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మళ్లీ బరిలో నిలపాలని సవాల్ విసిరారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదన్నారు. రైతుల కండ్లల్లో ఆనందం అని చెప్పుకునే రేవంత్ కనీసం రైతుబంధు, రైతు బీమా కూడా రైతులకు అందించడం లేదన్నారు. కేసీఆర్ పాలనలో కళ్లలో ఆనందం ఉంటే కాంగ్రెస్ పాలనలో రైతుల కళ్లలో కన్నీరు వస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.29 వేల కోట్ల రైతుబంధు కింద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడిందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గబ్బిలాల నిలయంగా మార్చితే అదే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 12 కిలోమీటర్ల మేర తవ్వకాలు పూర్తిచేశారని గుర్తు చేశారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తిచేసుకున్న కనీసం 12 మీటర్ల మేర ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదన్నారు. ఈ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులో 8 మంది కార్మికులను బలిచేసి కనీసం వారి శవాలను సైతం బయటకు తీయలేదని ఆరోపించారు. సింగరేణి టెండర్లపై సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నాడని, ఆయన సొంత బావమరిది సృజన్‌రెడ్డికి సంబంధించిన షోద కన్‌స్ట్రక్షన్‌కు కట్టబెట్టారన్నారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు
. ఫ్లోరైడ్హ్రిత నల్లగొండగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నల్లగొండతో పాటు నకిరికల్‌లో బత్తాయి, నిమ్మ మార్కెట్ ఏర్పాటుచేయాలని తాను మంత్రిగా ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరగానే కేసీఆర్ ఆదేశాల మేరకు వెంటనే ఈ మార్కెట్లను అక్కడ ఏర్పాటుచేసి ప్రారంభించుకున్నామన్నారు. అసెంబ్లీలో మార్కెట్ల ఏర్పాటుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనను మెచ్చుకున్నాడని, ఇప్పుడేమో నల్లగొండకు బీఆర్‌ఎస్ ఏం చేయలేదని వెంకటరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాళేశ్వరం కుంగిపోయిందని ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డి మూసి, హైదరాబాద్ ప్రజలకు మల్లన్నసాగర్ జలాలు ఎట్లా ఇస్తున్నాడని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ కాళేశ్వరంలో భాగమన్నారు. కాళేశ్వరం కింద పంటలు పండుతున్నాయో లేదో రాష్ట్రంలో తిరిగే రైతులను అడిగితే తెలుస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారుల గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. కనీసం రేవంత్ రెడ్డి ఏ ఒక్క రోజైనా జై తెలంగాణ అనలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా పదవులను లెక్కించకుండా రాజీనామా చేస్తే రేవంత్‌రెడ్డి జిరాక్స్ పేపర్లు ఇచ్చి తప్పించుకున్నాడన్నారు. తెలంగాణ ఉద్యమంలో తనపై సుమారు 300కు పైగా కేసులుంటే రేవంత్ రెడ్డిపై ఒక్క కేసైనా ఉందా అని ప్రశ్నించారు.
సిద్దిపేట అంటేనే ఉద్యమాల గడ్డ అని ఇక్కడ ప్రతి ఇంటినుంచి ఉద్యమం చేసిన వారుంటారని స్పష్టం చేశారు. నిరంతరం రైతుల ఉసురుపోసుకుంటున్నా రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అహంకారంతో పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు ఉప్పుపాతర వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఇంటెలిజెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నివేదికను తెప్పించుకుంటే ప్రజలు కాంగ్రెస్‌పై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో రేవంత్‌రెడ్డికి తెలుస్తుందన్నారు. రాబోయేది మళ్లీ బీఆర్‌ఎస్ సర్కారేనని స్పష్టం చేశారు. బూత్ లెవెల్ ఏజెంట్లు పార్టీ గురించి కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, జంగిటి కనకరాజు, మోహన్‌లాల్, కొండం సంపత్ రెడ్డి, పాల సాయిరాం, గుండు భూపేష్, ధర్మవరం బ్రహ్మం, మోయిస్, మల్లికార్జున్ తదితరులున్నారు.












