నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 1,355కు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో మరిన్ని మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది. దుర్గంధం వెదజల్లుతుండడంతో దగ్గర్లోకి వెళ్లే పరిస్థితి లేదని సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది చెబుతున్నారు. డిఎన్‌ఎ పరీక్షల తర్వాతే ఆప్తులకు అప్పగించాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. మరోవైపు గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మొత్తం 4,996 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. వీరిలో కనీసం 589 మంది విదేశీయులు ఉన్నట్లు నేపాల్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇప్పటివరకు 13,396 మందిని రక్షించినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు చిత్వన్ జిల్లాలో 363 మృతదేహాలు, నవల్‌పరాసి వెస్ట్‌లో 221, నవల్‌పరాసి ఈస్ట్‌లో 222, నువాకోట్‌లో 197 మృతదేహాలను వెలికితీశారు.

అదేవిధంగా రసువాలో 169, గోర్ఖాలో 75, ధాదింగ్‌లో 70, తనహులో 38 మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద ప్రత్యేక సహాయక చర్యలు ముమ్మరం చేశారు. సొరంగాల్లో చిక్కుకుపోయిన వందలాది మంది కార్మికులను రక్షించేందుకు నేపాల్ సిబ్బందికి భారత్, చైనాకు చెందిన నిపుణుల బృందాలు సహకరిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఈ విపత్తు కారణంగా చైనా వైపు కనీసం 21 మంది మరణించినట్లు సమాచారం. టిబెట్‌లో 500 మందికి పైగా ఇంకా గల్లంతైనట్లు చైనా మీడియా కథనాలు వెల్లడించాయి. మరోవైపు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడ్యాల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారంనాడు పర్యటించారు. బిదూర్ మున్సిపాలిటీ ఏరియాలో బాధితులను పరామర్శించి, వారికి అందుతున్న సహాయంపై ఆరా తీశారు. నువాకోట్, రసువా ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించారు.