చెన్నై: ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఇప్పటికే గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్ కు టివికె అధినేత విజయ్‌ లేఖ రాశారు. గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ను విజయ్ కోరారు. ఇప్పటికే టివికె పార్టీ ఎమ్మెల్యేలతో విజయ్‌ సమావేశమయ్యారు. హంగ్‌ రావడంతో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. టివికె పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పది సీట్ల దూరంలో ఉండడంతో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, పిఎంకె పార్టీలతో సమావేశమవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టివికెకి మద్దతు ఇస్తానని తెలిపిన విషయం తెలిసిందే. 


ప్రస్తుతం తమిళనాడులో కాంగ్రెస్‌ పార్టీ కీలక సమావేశం కానుంది. ఎన్నికల ఫలితాలు సహా తదుపరి చర్యలపై చర్చలు జరపనున్నారు. టివికెకు కాంగ్రెస్‌ మద్దతిస్తుందని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతుంది. టివికె సీనియర్‌ నేత సెంగోటియన్‌ కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నారు. విజయ్‌ ఆహ్వానిస్తే మద్దతు ఇచ్చే అంశం పరిశీలిస్తామని వామపక్ష పార్టీలు తెలుపుతున్నాయి. మద్దతుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వామపక్ష పార్టీలు పేర్కొన్నాయి. తమిళనాడు సిఎం పదవికి స్టాలిన్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు స్టాలిన్ పంపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో టివికె(108), డిఎంకె(59), అన్నాడిఎంకె(47), కాంగ్రెస్(5), పిఎంకె(4), సిపిఐ(2), సిపిఎం(2), ఐయుఎంఎల్(2), విసికె(2),  బిజెపి(1), డిఎండికె(1), ఎఎంఎంకెఎంఎన్ కెజడ్(1) పార్టీలు స్థానాలలో గెలుపొందారు.