హైదరాబాద్: తప్పుడు కేసులపై న్యాయస్థానాల్లో ఎదుర్కొంటామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వ విచక్షణ అధికారమని, ప్రభుత్వ విచక్షణ అధికారాన్ని ఎవరూ లాక్కోలేరని అన్నారు. హైడ్రా కమిషనర్ అంశంలో హైకోర్టు తీర్పుపై సిఎం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జిహెచ్ఎంసీ కమిషనర్‌ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్ పై 400 కోర్టు ధిక్కరణ కేసులున్నాయని విమర్శించారు. హైడ్రా..ప్రభుత్వం తీసుకువచ్చిన అతిపెద్ద సంస్కరణ అని హైడ్రా బాగుందంటూ దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని, హైడ్రాను మరింత బలోపేతం చేస్తామని రేవంత్ తెలియజేశారు. పార్కులు, చెరువుల్లో కబ్జాలు పెడితే కూలగొడతారని, చెరువులు, కుంటలు నాలాలనే కాపాడడమే హైడ్రా విధి అని సూచించారు.

కబ్జాకోరులు తప్పుడు పత్రాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని, బతుకమ్మ కుంటను కబ్జా పెడితే పునరుద్ధరించారని..దానిపై కోర్టుకు ఎక్కారని మండిపడ్డారు. బతుకమ్మకుంటలో బిఆర్ఎస్ నేత 10 ఎకరాలు కబ్జా పెట్టారని, మాజీ సిఎం కెసిఆర్ పర్యటన సందర్భంగా ఆ నేత పూలవర్షం కురిపించాడని, పదెకరాలు కబ్జా పెడితే కనకవర్షం కూడా కురిపించవచ్చునని రేవంత్ ఎద్దేవా చేశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చారని..పేదలదా అది.. అని గండిపేట ఆక్రమిస్తే కూల్చారని..పేదలదా అది అని ప్రశ్నించారు. కబ్జాదారులను కాపాడేందుకు డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా బాధ్యతల పట్ల ప్రభుత్వానికి స్పష్టత ఉందని, హైకోర్టు ఆదేశాలను తాను ఇంకా చూడలేదని అన్నారు. హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వపరంగా సమీక్షిస్తామని, హైడ్రా పనులను భవిష్యత్తులో కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.