హైదరాబాద్ మరో అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంది. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గచ్చిబౌలిలోని అమెరికన్ కాన్సులేట్ సమీప రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గాలా రిసెప్షన్‌లో భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కలిసి అధికారిక ఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు, వ్యాపార, రక్షణ, ఏరోస్పేస్, టెక్నాలజీ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

భారత్-అమెరికా సంబంధాలు వేగంగా బలోపేతం అవుతున్నాయని, హైదరాబాద్ ఈ భాగస్వామ్యానికి కీలక కేంద్రంగా మారిందని సెర్గియో గోర్ పేర్కొన్నారు. ‘అమెరికా ఫస్ట్’ అంటే ఒంటరిగా ఉండటం కాదని, భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరిస్తున్నామని ఆయన అన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, అమెరికా 250 ఏళ్ల స్వేచ్ఛా ప్రస్థానాన్ని అభినందిస్తూ, భారత్‌ను అమెరికాతో అనుసంధానించే బలమైన వంతెనల్లో హైదరాబాద్ ఒకటిగా నిలుస్తోందని చెప్పారు.

ఇక అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్, తెలంగాణలోని ఏరోస్పేస్, డిఫెన్స్, ఏఐ, బయోఫార్మా రంగాలు ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాయని కొనియాడారు.

హైదరాబాద్ వేదికగా భారత్-అమెరికా సంబంధాలకు మరో కొత్త గుర్తుగా ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ నిలిచింది.