నగరంలో శనివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ, సాయంత్రానికి మేఘాలు కమ్ముకుని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ముఖ్యంగా ఉప్పల్, హబ్సిగూడ, నాచారం, బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నమోదైంది.
వర్షంతో పాటు చల్లని గాలులు వీయడంతో నగరవాసులు ఎండల నుంచి కొంత ఉపశమనం పొందారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇక రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాల ప్రభావం పరిమితంగానే ఉన్నప్పటికీ, రానున్న రోజుల్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
అయితే, వచ్చే రెండు వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తాజా అంచనాల్లో పేర్కొంది. అదే సమయంలో నెలాఖరు నాటికి వర్షాల కార్యకలాపాలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.











