
హైదరాబాద్: హైడ్రా పేద ప్రజలతో ఆటలాడుకుందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న బుల్డోజర్ పాలనపై హైకోర్టు చేసిన స్ట్రైక్ ఇది అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే అతితక్కువ సార్లు ఇలాంటి తీర్పులు వచ్చాయని, హైకోర్టు తీర్పు చెంప చెల్లమనేలా ఉందని చురకలంటించారు. మూడున్నర లక్షల నిరుపేద కుటుంబాలకు మాజీ సిఎం కెసిఆర్ ప్రభుత్వం పట్టాలిచ్చిందని, అధికారంలోకి వచ్చాక బంగాళాఖాతంలో పడేస్తామని కెసిఆర్ చెప్పారని అన్నారు. హైకోర్టు కూడా హైడ్రాను బంగాళాఖాతంలో వేసినట్లు తీర్పు ఇచ్చిందని, జగిత్యాలలో కెసిఆర్ చెప్పిందే నిజమైందని తెలియజేశారు. రేవంత్ రెడ్డి ఇల్లు, సోదరుల ఇండ్లు హైడ్రాకు కనబడడం లేదా? అని కెటిఆర్ ప్రశ్నించారని దాసోజ్ అన్నారు. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా రంగనాథ్ కు బుద్ధి రావడం లేదని, రంగనాథ్ మళ్లీ కోర్టుధిక్కరణకు పాల్పడుతున్నారని విమర్శించారు. రంగనాథ్ ను పలికిస్తున్నది రేవంత్ రెడ్డేనని భావిస్తున్నామని, రంగనాథ్ తోలు బొమ్మ అని ఎద్దేవా చేశారు. రంగనాథ్ ను ఆడిస్తున్నది అసలు నిందితుడు రేవంత్ రెడ్డేనని, హైడ్రాపై హైకోర్టు ఇచ్చిన తీర్పు మామూలు తీర్పు కాదని దాసోజ్ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు.











