మెజారిటీకి పది సీట్ల దూరంలో ఆగిపోయిన టివికె దళపతి విజయ్ చివరకు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నారు. పార్టీ పెట్టిన రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఇంతటి విజయాన్ని కైవసం చేసుకోవడం ఆషామాషీ కాదు. డ్బ్భై ఏళ్ల నుండి పాలకుల వయసు యాభై, అరవైలకు దిగిరావడం దేశానికి ఓ మంచి పరిణామం. యువ రక్తపు ఆలోచనల్లో, పాలనలో, నిర్ణయాల్లో ఆధునికత, వేగం ఉంటాయి. కొంగ్రొత్త విధానాలకు పాలనలో చోటు లభిస్తుంది. నేటి తరం గద్దెనెక్కితే పాత వాసనలు పోయి.. ప్రభుత్వంపై, ప్రజలపై అనవసరపు భారాలు తగ్గి నూతన ఆర్థిక, సామాజిక విధి విధానాలతో కొత్త పుంతలు తొక్కాలి. వయసు మీరిన నేతల పాలనను మారిపోయి రాష్ట్ర ఆర్థిక పుష్టి పెరిగేలా.. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడేలా పథక రచనలు ఉండాలి.

అయితే టివికె దళపతి విజయ్ తమిళ నేలపై సరికొత్త మార్పును అందించే విత్తనాలనేమీ చల్లలేదు. అందరి మాదిరే అలవి కానీ జనాకర్షక హామీల బాటలోనే విజయ్ నడిచారు. నటుడైన ఆయనకు ఎన్నికల్లో యువత తోడుంటే.. పెంచిన, కొత్త ధన సహాయ పథకాలకు కుటుంబాలు మద్దతునిచ్చాయి. ఫిబ్రవరి 2024 లో పార్టీ ఆరంభించిన ఆయన తొలి సభకు 8 లక్షల మంది వచ్చారని అంచనా. ఎన్నడూ ప్రజల్లోకి రాని సినిమా హీరోను చూడడానికి యువత ఎగబడడం మామూలే. ఆ సంఖ్యను నమ్మి ఎన్నికల్లో విజయాన్ని ఊహించడం అంటే తప్పులో కాలేసినట్లే. మన తెలుగు హీరోలు ఆరంభించిన పార్టీలు పెట్టిన సభలకు జనం జాతరలా తరలి వచ్చారు. ఆ లెక్క బ్యాలెట్ బాక్సుల వద్ద మారిపోయింది. స్వయంగా పార్టీ మూల స్తంభాలైన వారే ఓటమి పాలయ్యారు. గెలుపు వెనుక ‘అభిమానం’ తో పాటు ‘సంక్షేమ’ ఆకర్షణలు కూడా ఉండక తప్పదు. తమిళనాడులో ఎంజిఆర్, తెలుగునాట ఎన్‌టిఆర్ నటులైనా రెండు రూపాయలకు కిలో బియ్యం ఆశ చూపే గెలిచారు.

నటుడు విజయ్ కూడా తన జనాకర్షణకు తోడు ఓటర్లకు ధనాకర్షణను కూడా జోడించారు. పాత హీరోల జమానాలో ఒకట్రెండు సంక్షేమ పథకాలు ఉండడంతో బడ్జెట్‌పై దాని ప్రభావం తక్కువగా ఉండేది. ఇప్పుడు పోటాపోటీ పథకాలు, ఉన్నవాటి మొత్తాలను పెంచివేయడం వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గుల్ల అవుతోంది. ఈ రోజుల్లో ఉన్న పథకాల్లో మార్పు తేకుండా ఓట్లు సంపాదించినవాడే మొనగాడు. ఓ రకంగా తెలంగాణలో రేవంత్, తమిళనాడులో విజయ్ గెలుపులకు ఆకర్షక పథకాలే మూల ఇంధనం. రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియంది కాదు, పథకాలు పెంచితేనే గెలుపు సాధ్యమని తెలుసు. అయినా వాటినే గాలాలుగా విసిరి అందలాన్ని అందుకొని తమ పదవీ కాంక్షలను నెరవేర్చుకోగా, చివరకు ప్రజల నెత్తిన పెరిగిన ఆర్థిక భారమే మిగులుతుంది.

విజయ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తన హామీల అమలుకు రాష్ట్ర ఆదాయం అడ్డంకి కాదన్నారు. రాష్ట్రంలో ప్రతి పనికీ వసూలు చేస్తున్న 30% స్టాలిన్ టాక్స్‌ను రూపుమాపితే చాలు అని అన్నారు. ప్రమాణ స్వీకారం చేశాక తొలి ప్రసంగంలోని ఆయన ప్రజల సొమ్మును తాకను, తాకనివ్వను అన్నారు. పూర్తి మెజారిటీ లేని ఆయన హ్యాండీ క్యాప్డ్ సిఎం కిందే లెక్క. నిజానికి గద్దె పైకి ఎవరొచ్చినా నాయకుల, అధికారుల కమీషన్లు ఆపలేరు. అందరూ ఆ తానులోని ముక్కలే. విజయ్ కోసం ఎవరూ కొత్తగా పుట్టుకు రాలేదు. విజయ్ తమిళ ప్రజలకిచ్చిన హామీలను చూస్తే రాజకీయాల్లోకి కొత్త తరం వచ్చిందన్న సంతోషం ఆవిరవుతుంది. కుటుంబ మహిళలకు ఇచ్చే సహాయం నెలకు రూ. 1000 ఉంటే దాన్ని రూ. 2500 చేశారు. చిన్న రైతులకు పంట రుణ మాఫీ ప్రకటించారు. వృద్ధాప్య, వితంతు పింఛన్లను రూ. 1200 నుండి రూ 3 వేలు చేశారు. 100 యూనిట్ల ఉచిత కరెంటును 200 యూనిట్లకు మార్చారు. పెళ్లి కూతుళ్ళకు 8 గ్రాముల బంగారం, ఓ ఖరీదైన పట్టు చీర హామీ. ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఏడాదికి రూ. 15 వేల చొప్పున రైతు భరోసా. నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి. తొలిరోజే రెండు హామీల అమలుపై సంతకాలు చేశారు.

తమిళనాడు ప్రభుత్వం ప్రస్తుత రుణభారం 9.30 లక్షల కోట్లు. ఇంకో లక్షన్నర కోట్ల అప్పుకు స్టాలిన్ ప్రభుత్వం మార్చి నెలలో ప్రయత్నించింది. సిఎం సీటు ఎక్కగానే విజయ్ అన్న మొదటి మాట ఈ అప్పుల కుప్ప గురించే. హామీల గురించి వేగిరపడొద్దని ప్రజలకు పరోక్ష విన్నపంలా ఆ మాటలున్నాయి. తమిళనాడు గత ఏడాది బడ్జెట్ రూ. 3.44 లక్షల కోట్లు. అందులోంచి సిబ్బంది జీతాలు, పింఛన్లు, వడ్డీల కింద 60% వెళ్ళిపోతుంది. మిగిలిన లక్ష కోట్లతో సర్కారు నడవలేక అప్పులు పెంచుకుంటూ పోతోంది. ఇప్పుడు విజయ్ పెంచిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వానికి ఏడాదికి మరో లక్ష కోట్లు అవసరమని విశ్లేషకుల అంచనా. మన దగ్గర పెంచిన హామీలను వేరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లకే బేజారు అవుతోంది. విద్యార్థులు ఫీజు బకాయిలు, ఉద్యోగుల జీతాల పెంపు, పెన్షనర్ల సొమ్ము చెల్లింపు.. ఇలా ఎన్నో నిలిపివేతలపై కోర్టు ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. విజయ్‌కి కూడా ముందు ముందు ఇదే పరిస్థితి ఆయనకు కూడా ఎదురవుతుంది. ఉచితాలు వద్దే వద్దని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్‌బిఐ మాజీ గవర్నర్లు అంటున్నారు. సుప్రీంకోర్టు సెలవిస్తోంది. ఎవరు ఈ మాటను చెవిన పెట్టడం లేదు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన దళపతి కూడా ఉచితాల నిచ్చెనపై అధికారం అందుకుంటే ఇక దేశ రాజకీయాల్లో నవశకం వచ్చేదెన్నడు? ‘రోజుకో వాగ్దానాల మృతశిశువును ప్రసవించే ప్రభుత్వానికి ముఖ్యమంత్రులే మంత్రసానులు’ అన్నాడు అలిశెట్టి. ప్రజలపై అప్పు భారాన్ని పెంచుతూ పోయే మరో ప్రభుత్వమే వస్తే తమిళ ప్రజలు స్టాలిన్‌ను వద్దనుకుని సాధించిందేమిటి?