
నిజామాబాద్: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను ఏ తప్పూ చేయకున్నా తిహాడ్ జైలులో పెట్టారని అన్నారు. తండ్రిని బిడ్డను వేరు చేయడంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిదే మొదటి పాత్ర అని దుయ్యబట్టారు. ఆయన శకుని పాత్ర పోషించినట్లు ఆరోపించారు. నిజామాబాద్‌లో నిర్వహించిన పాంచజన్య సభలో కవిత మాట్లాడుతూ కంటతడి పెట్టారు. ‘‘హరీశ్‌రావునో, సంతోష్‌రావునో క్షమిస్తాను కానీ, ప్రశాంత్ రెడ్డిని మాత్రం క్షమించను. ఆయనకు నా ఉసురు తగులుతుంది. ప్రశాంత్ రెడ్డిని కెసిఆర్ కుమారుడిలా చూసుకుంటే.. ఆయన మా మధ్య చిచ్చుపెట్టారు. కెసిఆర్ ప్రభుత్వం దిగిన రెండో రోజే ఆయన కాంగ్రెస్ పార్టీతో మాట్లాడారు. ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నెల రోజులు అమెరికాలో ఉండి వేం నరేందర్‌రెడ్డితో సంప్రదింపులు జరిపారు.
ప్రశాంత్ రెడ్డికి ప్రజా జీవితం లేదు. ఆయన బాల్కొండ నుంచి పారిపోవాలి. ఆయన వైఖరి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉంది. ఆక్ష్న మంత్రి కావడానికి నేను ఎంతో ప్రయత్నం చేశా. ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, బాజి రెడ్డి, ఆనాటి బోధన్ ఎమ్మెల్యేను గెలిపించడానికి ఎంతో కష్టపడ్డాను. అయితే వారందరూ నన్ను పరాజితురాలిని చేశారు. నేను ఏం తప్పు చేశానని తిహాడ్ జైలులో పెట్టారు? నిజామాబాద్ కోడలిగా ఉద్యమం చేసిన నన్ను నాలుగేళ్లు ఇడి, సిబిఐ వేధింపులకు గురి చేశాయి. చివరకు నేను ఏ తప్పు చేయలేదని తేలింది. నన్ను ఎందుకోసం పార్టీ నుంచి బహిష్కరించారు? తెలంగాణ రక్షణ సేన.. పదవుల కోసం పెట్టిన పార్టీ కాదు. కన్నీళ్లు పెట్టుకున్నానని నేను పిరికిదాన్ని అనుకోవద్దు’’ అని కవిత చెప్పారు.











