మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కట్టు తప్పుతోంది. ఇటీవల కాలం నుంచి పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అన్ని పార్టీలూ ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఒక జిల్లా వివాదం సమసిపోయిందని ఊపిరి పీల్చుకునేలోగానే మరో జిల్లాలో వివాదం ఆరంభమవుతోంది. ఈ పరిణామాలపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను కాంగ్రెస్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించుకోవడం కలకలం రేపింది. దీనిపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి మంత్రి కొండా సురేఖకు నోటీసు పంపించారు. మరోవైపు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి జి. చిన్నా రెడ్డికీ షోకాజ్ నోటీసు పంపించారు. వనపర్తి ఎమ్మెల్యే టి. మేఘారెడ్డి డబ్బులు

వెదజల్లి టిక్కెట్ తెచ్చుకున్నారని ఆరోపించడమే కాకుండా తాను అవసరమైతే మరో జీవన్ రెడ్డిలా మారుతానంటూ చేసిన వ్యాఖ్యలపై పార్టీ నాయకత్వం ఆగ్రహంగా ఉంది. పార్టీలో సీనియర్ నాయకుడైన జి. చిన్నా రెడ్డి హుందాగా ఉండకుండా పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని పార్టీ నాయకత్వం సీరియస్‌గా ఉంది. దీంతో మూడు రోజుల్లోగా తమకు వివరణ ఇవ్వాల్సిందిగా పార్టీ క్రమశిక్షణా కమిటీ ఆయనకు నోటీసు పంపించింది. చిన్నారెడ్డి లోగడ ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎవరెవరికి డబ్బులు ఇచ్చారని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా చిన్నారెడ్డి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుని హోదాలో బిఆర్‌ఎస్ నాయకులకు పనులు చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  వ్యాఖ్యలు ప్రతి నిత్యం తలనొప్పిగా ఉంటున్నాయని పార్టీ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. బిజెపిలో ఉన్న రాజగోపాల్ రెడ్డి ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.


అయితే అప్పుడు తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పినందుకే కాంగ్రెస్‌లో చేరానన్నది ఆయన వాదన. రాజగోపాల్ రెడ్డికి స్వయాన సోదరుడైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్న తర్వాత రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎలా ఇస్తామన్నది పార్టీ నాయకత్వం అభిప్రాయం. తాము ఇరువురం సొంత సోదరులమన్న విషయం టిక్కెట్లు ఇచ్చేప్పుడు తెలియదా? అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించడమే కాకుండా తనకు మంత్రి పదవి ఇస్తారా? లేక ముఖ్యమంత్రి పదవి లాక్కోవాలా? అని ఆయన ప్రశ్నించడంతో మరింత దుమారం చెలరేగింది. పలు పర్యాయాలు క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యలో రాజగోపాల్ రెడ్డిని వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించామని పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి బుధవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు.

ఆదిలాబాద్ డిసిసికి నోటీసు

ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు నరేష్ జాదవ్‌కూ పార్టీ క్రమశిక్షణా కమిటీ నోటీసు జారీ చేసింది. ఇటీవల జిల్లా పార్టీ సమావేశంలో ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణా రావు, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ సమక్షంలోనే నరేష్ జాదవ్ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పార్టీ సీరియస్‌గా తీసుకుంది. దీంతో మూడు రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై వేటు

యాదగిరి గుట్ట ఆలయ పాలక మండలి సభ్యురాలైన ఈశ్వరమ్మ ఫ్లెక్సీ వివాదం విషయంలో జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై బుధవారం సస్పెన్షన్ వేటు పడింది. జక్కిడి ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జక్కిడి శివచరణ్ రెడ్డి గత నెలలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసి వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణతో తండ్రి-కుమారుడు బయటపడినా తాజాగా తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఎస్‌టిలపై చేసిన వ్యాఖ్యలతో మరో వివాదంలో చిక్కుకున్నారు. దీంతో ప్రభాకర్ రెడ్డిపై వేటు పడక తప్పలేదు.

తుంగతుర్తి సామ్యూల్,

నిజామాబాద్ షబ్బీర్ అలీ

ఇదిలాఉండగా ఇటీవల కాలంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్ విషయంలో, నిజామాబాద్‌లో ప్రభుత్వ సలహాదారు (మైనారిటీ) మహ్మద్ షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. అంతకుముందు హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నాయకులు బాహాబాహికి దిగిన సంగతి తెలిసిందే. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్ సమక్షంలోనే నేతలు గొడవకు దిగడంతో అర్థాంతరంగా సమావేశం ముగిసింది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు పార్టీ క్రమశిక్షణ కమిటీ కఠినంగా వ్యవహారించకుండా వారికి సర్ది చెప్పడం వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని పార్టీ సీనియర్ నేతల మనోగతం. కఠినంగా వ్యవహారిస్తే ఇటువంటివి పునరావృతం కావనేది వారి అభిప్రాయం.


నేడు సీఎం విదేశీ పర్యటన..

మనసంత పార్టీ వ్యవహారాలపైనే

ఇదిలాఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి) సమావేశంలో పాల్గొంటున్న సమయంలోనే పార్టీలో గొడవలు జరగడంతో ఆయన, ఇంకా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఫోన్ చేసి సమాచారం సేకరించినట్లు సమాచారం. కఠినంగా ఉండాలని ఎవరినీ ఉపేక్షించరాదని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు గురువారం ఆయన ఢిల్లీ నుంచి పది రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నా పార్టీ అంతర్గత విభేదాలతో చికాకు కలిగిస్తుందని ఓ నాయకుడు వ్యాఖ్యానించారు.