హైదరాబాద్‌లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నిమ్స్ వైద్యులు ఏకంగా రెండు వేల కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసి దేశ వైద్య రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా యూరాలజీ విభాగం వైద్య బృందం నిరంతర శ్రమతో వేలాది మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు కొత్త జీవితం అందిస్తోంది.
దేశవ్యాప్తంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్వహిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నిమ్స్ ప్రస్తుతం జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలవగా, దక్షిణ భారతదేశంలో మొదటి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. గుజరాత్‌లోని ఐకేడీఆర్సీ (Institute of Kidney Diseases and Research Centre) తొలి స్థానంలో ఉండగా, లూధియానాలోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (Christian Medical College ) రెండో స్థానంలో ఉంది.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… మొత్తం ఆపరేషన్లలో దాదాపు 95 శాతం మందికి ఉచితంగానే చికిత్స అందించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి ప్రభుత్వ పథకాల ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతోంది. కేవలం మూడు సంవత్సరాల నాలుగు నెలల్లోనే 500 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు పూర్తి చేయడం నిమ్స్ వైద్యుల నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఘనతపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య బృందాన్ని అభినందించారు.













