
మన తెలంగాణ/లక్షెట్టిపేట: కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి ప్రజలు నరకం చూస్తున్నారని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆవేదన వ్య క్తం చేశారు. మంగళవారం మండలంలోని అంకతిపల్లిలోని ఓ ఫంక్షన్‌హాల్లో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన రైతు సదస్సులో ముఖ్య అతిథిగా హా జరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే కానీ, కాలం తెచ్చిన కరువు కాదన్నారు. రాష్ట్రానికి ఎల్‌నినో ప్రభావం చేసిన నష్టం కంటే కాంగ్రెస్ చేసిన నష్టమే ఎక్కువన్నారు. కన్నెపల్లిలో ఉన్న వాటర్‌ను రోజుకు మూడు టీఎంసీల చొప్పున అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజ్‌లకు బ్యాక్‌వాటర్ ఎందుకు పంపడలేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు? ఒక్క ఎల్‌నినో కాదు, ఇంకొక ఎల్‌నినో వచ్చినా మన రాష్ట్రానికి కరువు రాకుండా బ్యారేజీలు కట్టి బాహుబలి మోటార్లు పెట్టించిన ఘనత మన కేసీఆర్‌దేనన్నారు. ఎన్నికలకు ముందు రైతుబంధు కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తా అని ప్రజలను మభ్యపెట్టి నాలుగు సార్లు ఎగొట్టిన ఘనుడు రేవంత్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు.
అంతేకాకుండా నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు, రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇలా ఇచ్చిన హామీలన్నింటిని తుంగలో తొక్కాడన్నారు. కాళేశ్వరంపై రేవంత్ రెండు పిల్లర్స్ దెబ్బతిన్నాయని చెప్పి, 32 నెలలుగా ఎందుకు రిపేర్ చేయించలేదని ప్రశ్నించారు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద బూటకపు ప్రచారాలు చేస్తూ రైతుల పొలాలకు నీళ్లివ్వడం లేదని మండిపడ్డారు. అదేవిధంగా రేవంత్‌రెడ్డి వరంగల్ సభలో ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తానని మోసం చేశాడన్నారు. 32 నెలలు గడిచినా ఎందుకు రుణమాఫీ చేయడం లేదని ప్రశ్నించారు? మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు తన పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలే కానీ, కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దన్నారు. అదేవిధంగా అకాల వర్షానికి గోడలు కూలి రైతులు మరణిస్తే రెండున్నర నెలలు గడచినా వారికీ ఎలాంటి సహాయం అందలేదని బాధను వ్యక్తం చేశారు. చివరికి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా ద్వారా ఒక్క రైతు కుటుంబానికి మాత్రమే రూ.5 లక్షలు అందాయన్నారు.
మరణించిన నలుగురు రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చెక్కులను కేటీఆర్ అందజేశారు. రైతులు చనిపోతున్నా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదా అని ప్రశ్నించారు? ఇంకొక్క 28 నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని ఈ చేతకాని, రైతులను పట్టించుకోని ప్రభుత్వం పడిపోతుందని ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. ఈ కార్యక్రమంలోజిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, జీవన్‌రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యేలు కోవ ల, సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, సుంకె రవిశంకర్, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, మాజీ ఫిల్మ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, రాష్ట్ర నాయకులు విజిత్‌రావు, మాజీ డీసీ ఎమ్మెస్ తిప్పని లింగయ్య స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
దళిత ఉద్యమకారుడి ఇంట్లో కేటీఆర్ సహపంక్తి భోజనం..
లక్షెట్టిపేట పట్టణంలో రైతు సదస్సు ముగిసిన అనంతరం మండలంలోని రంగపేట గ్రామానికి చెందిన సీనియర్ ఉద్యమకారుడు దళిత నాయకుడు చిప్పకుర్తి నారాయణ ఇంట్లో కేటీఆర్ సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా గ్రామ కార్యకర్తలు, నాయకులు కేటీఆర్ వెంట భోజనం చేశారు. ఈ సందర్భంగా చిప్పకుర్తి నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి తన ఇంట్లో భోజనం చేయడం ఆనందంగా ఉందన్నారు.











