
అమరావతి: రాజమహేంద్ర వరం వైద్య విద్యార్థిని ప్రియాంక కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. మద్యం మత్తులో ప్రియాంకను కారుతో ఢీకొన్న ఘటనలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది రోడ్డు ప్రమాదం కాదు..క్రిమినల్ చర్యని తూర్పుగోదావరి జిల్లా ఎస్పి నరసింహ కిశోర్ తెలిపారు. మాల్ లో ప్రియాంక, నిందితులకు మధ్య వాగ్వాదం జరిగిందని, ప్రియాంక బైక్ ను కావాలనే మూడు సార్లు ఢీకొట్టారని అన్నారు. ప్రియాంక ప్రమాద ఘటనపై ఎస్పి నరసింహ కిశోర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంక స్నేహితుడు ఉమేష్ స్టేట్ మెంట్ రికార్డు చేశామని, అప్పటికప్పుడు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఎస్పి తెలియజేశారు. నిందితులను ఇద్దరినీ ప్రశ్నించామని, ఘటన జరిగిన తర్వాత కొన్ని గంటల్లోనే వివరాలు సేకరించామని, ఆధారాలతో సహా నిందితులను న్యాయాధికారి ఎదుట ప్రవేశ పెట్టామని చెప్పారు. ఈ నెల 6న నిందితులకు రిమాండ్ విధించామని, కేసును ఛాలెంజింగ్ గా స్పీకరించి.. ప్రత్యేక పిపిని ఆశ్రయించామని, నిందుతులు ప్రియాంక హత్యకు యత్నించారని వీడియోలు చూస్తే అర్థమవుతుందని ఎస్పి నరసింహ కిశోర్ సూచించారు.








