కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల విజయమని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై హింస, పెల్లెట్ గన్‌లు ప్రయోగించిన ఘటనలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షానే బాధ్యులని ఆరోపించారు. విద్యార్థులపై అణిచివేతను పార్లమెంటులో ప్రశ్నిస్తామని చెప్పారు. ప్రభుత్వం తమ కీలకమైన డిమాండ్లను పరిష్కరించేందుకు అంగీకరించడంతో నిరసనలు విరమిస్తున్నట్టు సీజేపీ ప్రకటించిన అనంతరం మీడియాతో రాహుల్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే గొప్పదైన మన విద్యా వ్యవస్థలో కొన్నేళ్లుగా ప్రైవేటీకరణ చొచ్చుకొచ్చిందని. ఆర్‌ఎస్‌ఎస్ దొడ్డిదారిన మన విద్యావ్యవస్థలో చొరబడి నాశనం చేసిందని తప్పుపట్టారు.

ఇందుకు ప్రతిస్పందనగానే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయని అన్నారు. వ్యవస్థను మెరుగుపరచేందుకు ప్రభుత్వం ఇకనైనా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యా వ్యవస్థలో సంస్కరణలపై ఉద్యమం సాగించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, వారి హక్కులు, భవిష్యత్తును పరిరక్షించేందుకు ఎప్పుడు ఏ అవసరమున్నా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సాధించిన ఈ విజయంతో వారి కలలు సాఫల్యం అవుతాయన్న ధీమా వ్యక్తం చేశారు.