గ్లాస్గో: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరించిన కామన్వెల్త్ గేమ్స్‌కు ఆదివారం అర్ధరాత్రి తెరపడింది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా ఈ పోటీలు జరిగాయి. ఇందులో 74 దేశాలు పాల్గొన్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కెనడా, భారత్, స్కాట్లాండ్‌లు పతకాల పట్టికలో టాప్5లో నిలిచాయి. ఇక తర్వాతి కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2030లో గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా ఈ క్రీడలు జరుగనున్నాయి.

క్రీడలకు సంబంధించిన బాటన్‌ను భారత దిగ్గజ అథ్లెట్ నీరజ్ చోప్రా అందుకున్నాడు. నీరజ్‌తో పాటు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్విలకు స్కాట్లాండ్ క్రీడల నిర్వాహక కమిటీ సభ్యులు బాటన్‌ను అందజేశారు. క్రీడల ముగింపు వేడుకలు కనుల పండవగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ బృందం అలపించన పాటలు ఆకట్టుకున్నాయి. ముగింపు వేడుకలకు మానూషి ఛిల్లార్, మహదేవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.