పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు భగ్గుమన్నప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రంగా నెలకొన్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ భారత్‌లో ఇంధన నిల్వలు తగినంత ఉండడంవల్ల పెద్దగా సమస్య తెలియలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇంధనంకోసం విదేశాలపై ఆధారపడడం ఎంత తగ్గిస్తే అంతమంచిదన్న భవిష్య దృష్టితో కేంద్ర ప్రభుత్వం బొగ్గు గ్యాసిఫికేషన్ పథకాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఈమేరకు కోల్‌గ్యాస్‌ఫికేషన్ కోసం రూ. 37,500 కోట్ల రాయితీ పథకాన్ని అంగీకరించడం చారిత్రాత్మకమైన మార్పు. దీని ద్వారా 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాస్‌గా మార్చి, విదేశాలనుండి దిగుమతి చేసుకునే ఎరువులు, రసాయనాల భారాన్ని తగ్గించడమే ప్రధాన లక్షం. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇంధన రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నిర్ణయం అత్యంత కీలకం కానుంది.

భారత దేశ ఇంధన రంగంలో ఒక కొత్తశకానికి కేంద్ర ప్రభుత్వం పునాది వేసింది. మన దేశంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పటికీ రసాయనాలు, ఎరువులకోసం మనం ఇంకా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఈ పరిస్థితిని మార్చేందుకు ఈ భారీ పథకానికి కేంద్రం ఆమోదముద్రవేసింది. కేవలం బొగ్గును మండించి విద్యుత్ తీయడమే కాకుండా, దాన్ని గ్యాస్‌గా మార్చి విలువైన ఇంధనాలుగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ అసలు ఉద్దేశం. చాలామంది బొగ్గు అంటే కేవలం థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో మండించి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే నల్లని రాయి అనుకుంటారు. కానీ గ్యాసిఫికేషన్ ప్రక్రియలో బొగ్గును మండించరు. బదులుగా దాన్ని నియంత్రిత ఆక్సిజన్, నీటి ఆవిరితో అధిక పీడనంతో రసాయనిక చర్యకు గురిచేస్తారు. ఇలా చేయడం వల్ల సిన్ గ్యాస్ (సింథటిక్ గ్యాస్)అనే వాయు మిశ్రమం ఉత్పత్తి అవుతుంది. ఇందులో కార్బన్‌మోనాక్సైడ్, హైడ్రోజన్, మిథేన్ ఉంటాయి. వీటితో మనం పెట్రోల్, డీజిల్, యూరియా, మిథనాల్ వంటివి తయారు చేయవచ్చు.

అంటే భూమిలో ఉన్న బొగ్గును గ్యాస్ రూపంలో బయటకు తీసి, దాంతో మనం విదేశాల నుంచి కొనే గ్యాస్ అవసరాలు తీర్చుకోవచ్చు. ప్రస్తుతం భారత్ తనకు కావలసిన ముడి చమురులో 83%, మిథనాల్‌లో 90%, విదేశాలనుంచే దిగుమతి చేసుకుంటోంది.ఈ కొత్త పథకం ద్వారా దేశీయ బొగ్గునే వినియోగించుకుంటే లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. మన దగ్గర 200 ఏళ్లకు సరిపడే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా వాడుకుంటే దిగుమతుల భారం తగ్గుతుందని కేంద్రం చెబుతోంది. గతంలో బొగ్గు గ్యాస్‌ఫికేషన్ పథకానికి కేవలం రూ. 8500 కోట్లు మాత్రమే కేటాయించారు. కానీ ఇప్పుడు దాన్ని దాదాపు నాలుగు రెట్లు పెంచి రూ. 37,500 కోట్లు చేయడం బట్టి ప్రభుత్వం ఈ పథకం ఆవశ్యకత ఎంత ఉందో ప్రత్యేకించి శ్రద్ధ తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఒక్కో ప్రాజెక్టుకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని కూడా రూ. 1350 కోట్ల నుంచి రూ. 3000 కోట్ల వరకు పెంచారు. దీనివల్ల రిలయన్స్, అదానీ వంటి ప్రైవేట్ దిగ్గజాలతోపాటు కోల్ ఇండియా, గెయిల్ వంటి ప్రభుత్వ సంస్థలు కూడా ఈ రంగంలోకి భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం కలుగుతుంది.

2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాస్‌గా మార్చాలనే లక్షాన్ని చేరుకోవడంలో ఈ ప్యాకేజీ ఒక ‘గేమ్ ఛేంజర్’ కానుంది. దీనివల్ల చమురు దిగుమతులు 10 నుంచి 15 శాతం తగ్గుతాయి. రూ. 50,000 కోట్లు ఆదా అవుతాయి. కేవలం దిగుమతులు తగ్గడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే బొగ్గును నేరుగా మండించడం కంటే గ్యాస్‌గా మార్చి, వాడటం వల్ల కాలుష్యం తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు ఆర్థిక వ్యవస్థకు చాలా ఊతం ఇస్తుంది. బొగ్గు విలువ 2 నుంచి 3 రెట్లు పెరుగుతుంది. జిడిపికి 2% తోడవుతుంది. చమురు దిగుమతులు తగ్గడంతో రూపాయి విలువ పెరిగే అవకాశం కలుగుతుంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటాయి.2030 నాటికి 10 గిగావాట్ హైడ్రోజన్ ప్యూర్ పవర్ టార్గెట్ చేసేందుకు ఈ మిషన్ సహాయపడుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో బొగ్గు గనుల ఆర్థికానికి ఇది వెన్నెముక లాంటిది. 2025 లో మనదేశంలో 1 బిలియన్ టన్నుల కన్నా ఎక్కువగా బొగ్గు ఉత్పత్తి అయింది. ప్రపంచం మొత్తంమీద బొగ్గు నిల్వలు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటైనప్పటికీ 80% ఖనిజ బొగ్గు నేరుగా విద్యుత్ కోసం మండించడమవుతోంది. మన బొగ్గుబూడిద ఎక్కువగా, తక్కువ క్యాలరీల విలువైనదైనప్పటికీ నేరుగా మండించడం కాలుష్యం వెదజల్లుతోంది. ఈ విషయంలో గ్యాస్‌ఫికేషన్ అమలైతే ఈ సమస్యలేవీ ఉండవు. ఉక్కు, రసాయనాలు, ఎరువులకు హైడ్రోజన్ అవసరం ఎక్కువ. గ్యాస్‌ఫికేషన్ వల్ల గ్రేహైడ్రోజన్, బ్లూహైడ్రోజన్ కూడా ఉత్పత్తి అవుతాయి. ఒడిశాలోని తాచేరు ఎరువుల ప్లాంట్ దేశంలోనే మొట్టమొదటి కోల్‌గ్యాస్‌ఫికేషన్ ఆధారిత ఎరువుల ప్లాంట్ కానున్నది. ఏటా 1.27 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు.

జిందాల్ స్టీల్‌కు చెందిన అంగూల్ ప్లాంట్ ప్రపంచం లోనే భారీ సిన్‌గ్యాస్ ఆధారిత స్టీల్ ప్లాంట్‌లుగా ఉంటున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ ప్లాంట్లను ఆ సంస్థ విస్తరింపచేస్తోంది. కోల్ ఇండియా, గెయిల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ తదితర సంస్థలు ఇంటిగ్రేటెడ్ గ్యాస్‌ఫికేషన్ ఎకో సిస్టమ్‌ను నెలకొల్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇవన్నీ సవాళ్లతో, అనేక చిక్కులతో కూడుకున్నాయి. కోల్‌గ్యాస్‌ఫికేషన్ విలువను చైనా ఏనాడో గుర్తించి ఆయా ప్లాంట్ల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో కోల్‌గ్యాస్‌ఫికేషన్ దిశగా ముందుకెళ్లడమే సరైన మార్గంగా కనిపిస్తోంది.