
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజల ప్రయాణానికి భద్రత, నమ్మకానికి ప్రతీకగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల రక్షణ కోసం మరో విప్లవాత్మక నిర్ణయంతో ముందుకొచ్చింది. ప్రమాదాలు, చోరీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు సంస్థ సరికొత్త వ్యూహాన్ని అమలులోకి తెచ్చింది. ప్రయాణికులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చూసేందుకు బస్సుల్లో అత్యాధునిక సిసి కెమెరాల నిఘా వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ ‘బస్సులో భరోసా‘ పేరిట రూపొందించిన ఈ సరికొత్త హైటెక్ భద్రతా ప్రాజెక్టును తొలి దశలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
ఈ సరికొత్త భద్రతా వ్యవస్థ కింద ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని సుమారు 175 బస్సుల్లో ఈ అత్యాధునిక నిఘా నేత్రాలను అమర్చారు. డ్రైవర్ క్యాబిన్ సమీపం, మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక సీట్లు, ఫుట్‌బోర్డుతో పాటు బస్సు లోపల చివరి సీటు వరకు ప్రతి అంగుళం స్పష్టంగా కవర్ అయ్యేలా ఈ కెమెరాలను ప్రత్యేక సాంకేతికతతో అమర్చడం విశేషం. బస్సు ఎక్కే ప్రతి వ్యక్తి ముఖ కదలికల నుంచి ప్రయాణంలో జరిగే ప్రతి చిన్న యాక్టివిటీ వరకు అన్నీ ఇందులో రికార్డు అవుతాయి. ఈ విజువల్స్ అటు డ్రైవర్, కండక్టర్లకు అందుబాటులో ఉండటమే కాకుండా ఆర్‌టిసి కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించేలా కనెక్ట్ చేశారు. దీనివల్ల బస్సుల్లో దొంగతనాలు చేసే ముఠాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ముందే గుర్తించి అప్రమత్తం కావడానికి, ఒకవేళ ఏదైనా అవాంఛనీయ సంఘటన లేదా ప్రమాదం జరిగితే తక్షణమే ఖచ్చితమైన ఆధారాలను సేకరించడానికి ఈ వ్యవస్థ ఎంతగానో దోహదపడనుంది.
మహిళా ప్రయాణికులపై వేధింపులు, దొంగతనాలు, అనుచిత ప్రవర్తన వంటి ఘటనలకు చెక్ పెట్టేలా ఆర్‌టిసి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సుదూర ప్రాంతాలకు ఒంటరిగా ప్రయాణించే మహిళలు, వృద్ధులు ఈ నిఘా కన్ను ఏర్పాటు పట్ల తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బస్సులో సిసి కెమెరా ఉందనే భయం నేరగాళ్లలో గుబులు పుట్టిస్తుందని, ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుందని ప్రజలు భావిస్తున్నారు.
అంతేకాకుండా ఈ కెమెరాల ఏర్పాటు వల్ల డ్రైవింగ్ ప్రమాణాలు కూడా మెరుగవుతాయని, సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు సాధించే ఫలితాలను బట్టి, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల బస్సులకు ఈ సిసి కెమెరాల రక్షణ కవచాన్ని విస్తరించడానికి ఆర్‌టిసి యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రజల భద్రత కోసం సాంకేతికతను జోడించి సంస్థను ప్రగతి పథంలో నడిపిస్తున్న ఆలోచనా సరళిపై ప్రయాణికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.












