మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రశ్న పత్రాల లీకేజీలకు కారణమైనవాళ్లను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు లేవని, ఆఫ్‌లైన్‌లో నిర్వహించినప్పుడే సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. అనుమతి లేకుండానే దేశంలో కోచింగ్ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, అవి ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడానికి వేదికలుగా మారుతున్నాయని విమర్శించారు. ఈ విషయంలో దేశస్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో మంగళవారం సిఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీల మీద ఆధిపత్యం చెలాయించాలనే ప్రయత్నాన్ని మానుకోవాలని సూచించారు. విద్యను వీలైనంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంచితే తప్పిదాలకు

అవకాశం తక్కువగా ఉంటుందని, ఈ అంశంపై పార్లమెంట్ చర్చ జరగాల్సి ఉందన్నారు. సభలో చర్చ జరిగితే తమ నేత రాహుల్ గాంధీ అన్ని అంశాలపై మాట్లాడతారని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీల నివారణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాన్ని చూసి తర్వాత రాష్ట్రంలో ఏం చేయాలనేది చూస్తామని సిఎం ఒక ప్రశ్నకు బదులిచ్చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టడంతోనే తాము పారదర్శకంగా పరీక్షలను నిర్వహించామని తెలిపారు. విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా, వారికి నమ్మకం, విశ్వాసం కలిగించేలా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్లోబరీనా వటి సంస్థలు నాడు అక్రమాలకు పాల్పడినా గత ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో వాళ్లు సిబిఎస్‌ఇ పరీక్షల వరకు విస్తరించి, వాటిని గందరగోళం చేశారని విమర్శించారు. ఇలాంటి సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

కెసిఆర్ పెట్టిన రీయింబర్స్‌మెంట్

బకాయిలే భారంగా మారాయి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి కెసిఆర్ ప్రభుత్వం రూ.8 వేల కోట్లను బకాయిలను పెట్టి పోయిందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎలాంటి వసతులు లేకుండా, దొంగ లెక్కలు చూపించి ఫీజు రీయింబర్స్‌మెంట్ కొట్టేయాలనుకునే సంస్థల మీద విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ సాగుతోందని తెలిపారు. సక్రమంగా ఉన్నవాళ్లకు బకాయిలు చెల్లిస్తామని సిఎం ఓ ప్రశ్నకు బదులిచ్చారు.కెసిఆర్ పెట్టిన బకాయిలే తమకు భారంగా మారాయన్నారు. తాము ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదన్నట్లుగా, తమ ప్రభుత్వం కారణమన్నట్లుగా బిఆర్‌ఎస్ భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తోందదని, దానికి బిజెపి వంతపాడుతోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు బకాయిలపై బిజెపి ఎంపీ ఆర్. కృష్ణయ్య ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఉన్న ఎపిలో 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయించిన తర్వా త తెలంగాణలో డిమాండ్ చేస్తే బాగుంటుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రామచందర్‌రావు, ఆర్. కృష్ణయ్యలకు సిఎం సూచించారు. గత ప్రభుత్వం బకాయిలే తమకు భారంగా మారాయని, అయి నా అన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో ఏ సంవత్సరానికి సంబంధించిన ఫీజుల మొత్తం అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తామని చెప్పారు. అడ్వాన్స్‌గా బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రూ.2,200 నుంచి రూ.2,400 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ అవసరమవుతాయని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా వాటిని చెల్లించేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రచించుకుందని, భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య రాష్ట్రంలో ఉండదని స్పష్టం చేశారు.