హైదరాబాద్: పేదవాడి చిరు కోరిక సొంత ఇల్లు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. క్యూర్ పరిధిలోని నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇస్తామని అన్నారు. హైదరాబాద్ లో అల్పాదాయ వర్గాల హౌసింగ్ స్కీమ్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆగష్టు నాటికి 2 లక్షల పైగా ఇళ్లు పూర్తి కాబోతున్నాయని, ఇందిరమ్మ రాజ్యంలోనే సొంత ఇల్లు సాకారమని తెలియజేశారు. స్థలం ఉన్నవారికి 4.50 లక్షల ఇళ్లు ఇచ్చామని, పేదలు నివసించే ప్రాంతంలోనే ఇల్లు ఇవ్వాలని నిర్ణయంచామని పొంగులేటి పేర్కొన్నారు. క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నామని, గజం రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలు ఉన్న ప్రాంతంలో కూడా ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. బిఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల కట్టిన ఇళ్లు కూడా ఇవ్వలేక పోయారని, బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లలో కొంత మందే నివసిస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. కోర్ పరిధికి 30 కి.మీ. దూరంలో గత ప్రభుత్వం ఇళ్లు ఇచ్చిందని, ఉపాధికి దూరంగా ఉండడంతో పేదలకు ఇచ్చిన ఇళ్లలో నివసించడానికి ఇష్టపడట్లేదని అన్నారు. ధనికులు నివసించే చోటే పేదలకు ఇళ్లు ఇవ్వాలనేదే తమ సంకల్పం అని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, సంక్షేమం కొనసాగిస్తున్నామని పొంగులేటి స్పష్టం చేశారు.

సచివాలయంలో ఎల్ ఐజి స్కీమ్ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అజారుద్ధీన్ ప్రారంభించారు. పథకం పేరు, విధివిధానాలు, అర్హతలు, ధరఖాస్తులపై మంత్రులు ప్రకటించారు. చార్మినార్, బహదూర్ పురా, ముషీరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో స్థలాలు గుర్తించారు. జిహెచ్ ఎంసి, సైబరాబాద్, మల్కాజ్ గిరిలో లక్ష ఫ్లాట్లు, తొలి విడత నియోజకవర్గానికి 500 ఫ్లాట్ల చొప్పున నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యూర్ పరిధిలో ఇల్లు, స్థలం లేని అల్పాదాయ వర్గాల కోసం కొత్త పథకం అమలు, క్యూర్ పరిధిలోని 26 అసెంబ్లీ నియోజక వర్గాల్లో టవర్ల రూపంలో నిర్మాణం చేయనునున్నారు. ఒక్కో టవర్ లో 10 ఫ్లోర్లు.. అంతస్తుకు 12 ఫ్లాట్లు నిర్మించేలా ప్రణాళిక అమలు చేయనున్నారు.