మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలో అల్పాదాయ వర్గాల కోసం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు భారీ స్పందన లభించింది. 16 నియోజకవర్గాల్లో 7,340 ఫ్లాట్లకు ఇప్పటివరకు 60,014 దరఖాస్తులు వచ్చాయని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతం తెలిపారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఈ నెల 20 తర్వాత పారదర్శకంగా లాటరీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబరు మొదటి వారంలో నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఇప్పటికే ప్రకటించిన 16 నియోజకవర్గాలకు అదనంగా ఎల్‌బీనగర్, గోషామహల్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో మరో 1,920 ఫ్లాట్లను నిర్మించనున్నారు. వీటి కోసం ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టిల్ట్ ప్లస్ 10 అంతస్తులతో టవర్స్ నిర్మించనున్నారు. దరఖాస్తుదారులు రూ.10 వేలు చెల్లించాలి. లాటరీలో ఇల్లు రాని వారికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ఎంపికైన లబ్ధిదారులు రూ.6 లక్షలను నాలుగు విడతల్లో చెల్లించవచ్చు. దరఖాస్తులను మీ సేవా కేంద్రాలు, మీ సేవా వెబ్‌సైట్, వాట్సాప్ సేవ ద్వారా చేసుకోవచ్చని గౌతం తెలిపారు. వివరాల కోసం 040-24603572 నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.