
దేశ రాజకీయాలు ఈ రోజు విరుద్ధ వైచిత్య్రంలో కొనసాగుతున్నాయి. బిజెపి నేతృత్వంలోని అధికార కూటమి వరుస విజయాలతో దూసుకునిపోతుండడమే కాదు, తదుపరి ఎన్నికల గెలుపు కోసం ఇప్పటినుంచే వ్యూహాలు రూపొందిస్తూ ఎత్తుగడలు సాగిస్తుండగా, నిరాశ చెందుతున్న విపక్ష పార్టీలు ‘ఇండియా కూటమి’ అనే రిక్రియేషన్ క్లబ్‌ను నడుపుతున్నాయి. ఏమాత్రం పొంతనలేని భాగస్వాములతో అప్పుడప్పుడు కలుసుకుంటూ పరాజయం పాలైనప్పుడు సమావేశమవుతూ గడుపుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ పాలనలో ఎన్నో ప్రజా సమస్యలు కనిపిస్తున్నాయి. సాధారణ పరీక్షలను కూడా నిర్వహించలేని అసమర్ధత వెంటాడుతోంది.
ద్రవ్యోల్బణం, విదేశాంగ విధానం వంటి ప్రాథమిక, సమగ్రమైన ఆర్థిక రాజకీయ సమస్యలను పక్కనపెడితే, పెరుగుతున్న నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో లోపాలు, పెడదారిపడుతున్న ప్రజాస్వామ్య విధానాలు, పౌరహక్కుల సంక్షోభం, తదితర కీలక అంశాలు ఎన్నో విపక్షాలు చేపట్టడానికి ఆయుధాలుగా ఉంటున్నాయి. కానీ వాటి వైపు విపక్షాలు సరిగ్గా దృష్టి సారించడం లేదు. ప్రజాభిమానం పొందాలంటే ఈ సమస్యలపైనే విపక్షాలు ఆందోళనలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. సహజంగా అశాంతి నెలకొన్న రాజకీయ వ్యవస్థలో ప్రజల దృష్టిని ఆకట్టుకునే ఉద్యమాలు చేపట్టడం ప్రతిపక్షం బాధ్యత. కానీ ‘ఇండియా కూటమి’ లోని భాగస్వామ్య పార్టీలు ఏకతాటిపై నడవకుండా పరస్పర విరుద్ధమైన లక్షాలతో పనిచేస్తుండడం వల్ల వారి ప్రయత్నాలన్నీ వృథా అవుతున్నాయి. ‘ఇండియా కూటమి’ బ్యానర్ కింద మంగళవారం ఢిల్లీలో 25 విపక్షాలు సమావేశమయ్యాయి.
కానీ ఈ సమావేశంలో వాస్తవ పరిస్థితులపై దృష్టి కేంద్రీకరించలేదు. తమలో లోపాలేమిటో అంతస్సమీక్షకు అవకాశం ఇవ్వకుండా వాటిని కప్పిపుచ్చుకునే ధోరణిలో ప్రవర్తించాయి. తమ స్వంత రాష్ట్రాల్లో తమ పార్టీ ఎందుకు ఓడిపోయిందో సమీక్షించుకోలేదు. ప్రధాని మోడీని వ్యతిరేకించడం ఒక్కటే ప్రధాన ఎజెండాగా చర్చలు సాగించాయి. ఈ సమావేశాన్ని అధికార బిజెపి, ఇతర రాజకీయ విశ్లేషకులు, కేవలం అవకాశ కూటమిగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఒక బలమైన రాజకీయశక్తిగా బిజెపి ఎదుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ కూటమి లేదా ప్రాంతీయ పార్టీల కూటమి స్థానిక సమస్యలు, నిరుద్యోగం, అభివృద్ధి అంశాలను ప్రధాన ఎజెండాగా మార్చుకుని ప్రజల్లోకి వెళ్లి పోరాటం సాగించాల్సిన అవసరం కనిపిస్తోంది. విపక్షాల కూటమి ఎంత బలహీనంగా కనిపిస్తున్నా డిఎంకె, ఆప్ అనే రెండు ప్రధాన వ్యవస్థాపక మిత్ర పక్షాలు లేకుండా ఇండియా కూటమిని ఊహించలేం. రాజకీయ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే బిజెపి హిందుత్వ రాజకీయాలను వ్యతిరేకించడమే ‘ఇండియా కూటమి’ లోని భాగస్వామ్య పార్టీలను ఒకే వేదిక పైకి తెచ్చే ఏకైక ముఖ్యమైన అంశమని ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది. సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ బిజెపి ఎదుగుదలను అడ్డుకోవడమే ప్రాంతీయ పార్టీల ప్రధాన లక్షం. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వల్ల ప్రాంతీయ పార్టీల స్వయం ప్రతిపత్తికి ముప్పు ఉంటుందనే అభిప్రాయమే వారిని ఏకం చేస్తోంది.
‘ఇండియా కూటమి’లో కాంగ్రెస్ పార్టీ ఏకైక జాతీయ పార్టీ కావడం వల్ల ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలు, స్థానిక రాజకీయ సమీకరణల కారణంగా రాష్ట్రాల్లో ఆ కూటమి లోని ఇతర పక్షాలతో విభేదాలు తలెత్తుతున్నాయి. ‘ఇండియా కూటమి’కి కాంగ్రెస్ నాయకత్వం వహించాలని చూస్తున్నప్పటికీ, ప్రాంతీయ పార్టీలు మాత్రం తమ రాష్ట్రాల్లో తమదే పైచేయిగా ఉండాలని భావించడం సహజం. ఈ నేపథ్యంలో జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయాలను స్థానిక నాయకులు వ్యతిరేకించడం లేదా అసంతృప్తిని వ్యక్తం చేయడం తరచుగా జరుగుతున్నాయి. ‘ఇండియా కూటమి’ ఏర్పడి మూడేళ్లు దాటినా, భాగస్వాముల మధ్య వైరుధ్యాలను ఆచరణాత్మకంగా పరిష్కరించడానికి నిర్మాణాత్మక విధానాన్ని కూటమి రూపొందించలేకపోయిందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో తాను కోల్పోయిన స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు భాగస్వామ్య పార్టీలకు ఒక్కోసారి నచ్చడం లేదు. .జార్ఖండ్‌లో ఈ పరిస్థితి తలెత్తింది. రాజ్యసభ అభ్యర్థిని ఎంపిక చేయడం వంటి అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు తమతో కాంగ్రెస్ చర్చించలేదని జార్ఖండ్ లోని కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం ఆరోపిస్తోంది. కేరళ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు అక్కడి అధికార వామపక్షానికి వ్యతిరేక ఫలితాలను అందించిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, వామపక్షాలు ‘ఇండియా కూటమి’లో భాగంగా కలిసి పనిచేస్తున్నాయి.
కానీ కేరళలో మాత్రం ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నాయి. ఈ పరిణామాలు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. ‘ఇండియా కూటమి’ గుర్తించిన ఐదు ప్రధాన సమస్యల్లో ప్రతి ఒక్కటీ ప్రజలకు అత్యంత కీలకమైనది. విద్యా వ్యవస్థలోని లోపాలపై యువత భగ్గుమంటోంది. ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ పేరుతో అనుసరిస్తున్న విధానాలు వయోజనుల రాజ్యాంగబద్ధమైన హక్కును అణచివేస్తోంది. ఇక ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సమస్యలతో సతమతమవుతోంది. ఇవన్నీ అత్యవసరంగా సరిదిద్దాల్సినవే. అందువల్ల విపక్షాల కూటమి ప్రజల మద్దతుతో పోరాటాలను ముమ్మరం చేసి ప్రభుత్వ మొద్దు నిద్రను వదిలించాలి. ప్రజాస్వామ్యం సజావుగా సాగడానికి సమర్థవంతమైన ప్రతిపక్షం అవసరం. ఈ బాధ్యతను విపక్షకూటమి గుర్తుపెట్టుకుని ఆ పాత్రను సమర్థవంతంగా నిర్వహించగలిగితే స్వాగతించదగిన పరిణామం అవుతుంది.












