
కోల్‌కతా: బెంగాల్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు రాజా సేన్ (71) కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆదివారం తుది శ్వాస విడిచారు. వెన్ను భాగంలో గాయపడటంతో ఆయన్ను తొలుత ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయన్ను మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో చికత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
1996లో వచ్చిన ‘దాము’ చిత్రంలో రాజా సేన్ దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి ఉత్తమ జాతీయ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘ఆత్మీయ స్వజన్’, ‘దేశ్’, ‘దేబీపక్ష’, కృస్ణకాంతేర్ విల్’, ‘లాబొరేటరీ’, ‘మాయా మృదంగ’ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. సినిమాలతో పాటు డ్యాక్యుమెంటరీల రూపకల్పనలోనూ రాజా సేన్ తనదైన ముద్ర వేశారు. ఆయన మరణంతో బెంగాల్ చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.











