మన తెలంగాణ/హైదరాబాద్: వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రభుత్వ ఇంజినీరింగ్ పనుల నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ప్రాజెక్టుల అమలులో జాప్యాలు, వ్యయభారం పెరగడం, తరచూ సవరించిన పరిపాలనా అనుమతులు గడు వు పొడిగింపులు, తాత్కాలిక చెల్లింపులు వంటి సమస్యలను సమీక్షించి సమగ్ర సం స్కరణలు సూచించేందుకు ప్రభుత్వం ఉన్న త స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో 93ను మంగళవారం విడుదల చేసింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఐఏఎస్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించనుండ గా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి శిక్తా ప ట్నాయక్, ఐఏఎస్ సభ్య కార్యదర్శిగా బా ధ్యతలు నిర్వర్తిస్తారు.

నీటిపారుదల, రోడ్లు- భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పబ్లిక్ హెల్త్  తదితర శాఖల ఇంజినీర్- ఇన్-చీఫ్‌లు, న్యాయ శాఖ ప్రతినిధి సహా మొత్తం 12 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుల ప్రణాళిక దశ నుంచే లోపాలు, భూసేకరణ ఆలస్యం, అనుమతుల జాప్యం, టెండర్ విధానాల్లో సమస్యలు, కాంట్రాక్ట్ నిర్వహణలో లోపాల కారణంగా ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడుతోందని ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవస్థను సమీక్షించి ఆర్థిక క్రమశిక్షణతో పాటు నాణ్యమైన, సమయపాలనతో కూడిన ప్రాజెక్టుల అమలుకు మార్గదర్శకాలు రూపొందించాలని కమిటీకి బాధ్యతలు అప్పగించింది.


ప్రాజెక్టుల రూపకల్పన, డీపీఆర్‌లు, భూసేకరణ, చట్టపరమైన అనుమతులు, టెండర్ విధానం, నమూనా ఒప్పంద పత్రాలు, కాంట్రాక్టుల నిర్వహణ, గడువు పొడిగింపులు, ధరల సవరణ, ఆర్థిక క్రమశిక్షణ, చట్టపరమైన సంస్కరణలు తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. అవసరమైతే నిపుణులను ఆహ్వానించి ఉప కమిటీలను కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ శాఖలకు ఒకే విధమైన టెండర్ పత్రాలు, కాంట్రాక్ట్ విధానాలు, నాణ్యత ప్రమాణాలు అమలు చేయడం, ప్రాజెక్టుల పురోగతిని డిజిటల్ విధానంలో పర్యవేక్షించడం, ఆర్థిక బాధ్యతను పెంచే చర్యలపై కూడా కమిటీ సిఫార్సులు చేయనుంది. కమిటీ ఏర్పాటైన తేదీ నుంచి ఒక నెలలోపు తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వ పనుల అమలులో కీలక విధానపరమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.