ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు అధ్యాపకులను కించపరిచేవిధంగా మాట్లాడిన సిఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సీపీఎస్ ఉద్యోగుల నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు కనీసం దరఖాస్తు నింపడం రాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. పాఠశాలలో చదివే చిన్నపిల్లల ముందు సైతం బూతులు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సమాధి చేశారన్నారు. కాంగ్రెస్ పాలన సగం కాలం దాటినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారన్నారు.

హక్కులపై ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై కేసులు, దాడులు చేయడమే తప్ప కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులను ఏసీబీ దాడులు చేపిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ బాగుపడలేదన్నారు. మన ఊరు మన బడి మధ్యలోనే ఆపేశారన్నారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న భర్తీలను పూర్తి చేయలేని పరిస్థితిలో రాష్ట్ర సర్కార్ ఉందన్నారు. విద్యాశాఖలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిస్థాయిలో విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే ఓపీఎస్ విధానాన్ని అమలుచేసి ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు ఇస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ సర్కార్ నేడు ఆ హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగా మాట్లాడితేనే కాంట్రిబ్యూషన్ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ భయభ్రాంతులకు గురిచేస్తే ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని, రానున్నది బీఆర్‌ఎస్ సర్కారేనని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రెండున్నర లక్షల ఉద్యోగులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందన్నారు.

సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ అమలు చేసేంతవరకు ఉద్యోగులకు బీఆర్‌ఎస్ సర్కార్ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఓపీఎస్‌పై అసెంబ్లీలో గళం విప్పి అవసరమైతే అసెంబ్లీనే స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిరసనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ, సంఘం ప్రతినిధులు గ్యాదరి పరమేశ్వర్, దేవరాజ్, విక్రంరెడ్డి, అసా లక్ష్మణ్, సతీష్, ఉదయశ్రీ, శ్రీకాంత్, ఇంద్రసేనారెడ్డి, రఘురాం, శ్రీనివాస్, నర్సింలు తదితరులున్నారు.