హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో కూడిన నగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ చేపట్టిన డోర్‌స్టెప్ ఫర్నిచర్ వ్యర్థాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సేవ ద్వారా పాత ఫర్నిచర్‌ను ఇంటి వద్ద నుంచే సేకరించి సరైన విధంగా నిర్వహిస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 498 ఫిర్యాదులు, అభ్యర్థనలపై స్పందించి మొత్తం 2,598 భారీ ఫర్నిచర్ వస్తువులను సేకరించారు. ఇందులో 325 పరుపులు (మ్యాట్రెస్‌లు), 205 సోఫాలు, 142 పడకలు, 48 క్యాబినెట్లు, 38 టేబుళ్లు, 25 బుక్ షెల్ఫ్‌లుతో పాటు 1,815 ఇతర భారీ ఫర్నిచర్ వస్తువులు ఉన్నాయి.

ఈ కార్యక్రమం ద్వారా పాత ఫర్నిచర్‌ను రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో లేదా కాలువల్లో పడేయకుండా నివారించవచ్చని అధికారులు తెలిపారు. దీంతో డ్రైనేజీలు మూసుకుపోవడం, వర్షాకాలంలో నీరు నిలిచిపోవడం వంటి సమస్యలను తగ్గించడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చని పేర్కొన్నారు.

ఇంకా పెండింగ్‌లో ఉన్న అభ్యర్థనలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తున్నామని జీహెచ్‌ఎంసీ తెలిపింది. ఎక్కువకాలంగా స్పందన రాని వారు తమ రిఫరెన్స్ నంబర్‌తో @GHMCOnlineను సంప్రదిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని అధికారులు సూచించారు.

పాత ఫర్నిచర్‌ను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా జీహెచ్‌ఎంసీ అందిస్తున్న డోర్‌స్టెప్ సేవను వినియోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచడంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో కీలకమని అధికారులు పేర్కొన్నారు.