
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రధాన కార్యాలయానికి సోమవారం ఇ మొయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దీనితో బెంగళూరులోని ఈ కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు లభించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. కొద్దిరోజుల క్రితమే ఇస్రోకు ఇదే విధమైన బెదిరింపు వెలువడింది. విస్తృత సోదాల తరువాత ఈ బెదిరింపు ఉత్తుత్తిదే అని తేలింది. దీనితో ఇస్రో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
స్థానిక పోలీసులు, డాగ్‌స్కాడ్, బాంబు డిటెక్షన్ డిస్సోజల్ బృందాలు తరలివచ్చాయి. దీనితో స్థానిక న్యూ బెల్ రోడ్‌లోని ఇస్రో కార్యాలయ పరిసరాలలో కొద్ది సేపు కలకలం చెలరేగింది. ఇస్రో కార్యాలయాన్ని పేల్చివేస్తామని ఇమొయిల్ ద్వారా తెలియచేసిన వ్యక్తుల వివరాలను రాబట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
కాగా, ఈ నెల రెండవ తేదీన కూడా ఇటువంటి బూటకపు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ రెండు బెదిరింపులకు ఏదైనా లింక్ ఉందా? అనే విషయాన్ని ఆరాతీస్తున్నారు. గత వారం వెలువడిన బెదిరింపు ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్ నుంచి అని నిర్థారించారు. అప్పటి దర్యాప్తు క్రమంలో ఈ బెదిరింపునకు దిగిన వ్యక్తికి మతిస్థిమితం లేదని గుర్తించారు.












