
మనతెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి కాంగ్రెస్ నేతలు యువతను మోసం చేశారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలో గడ్డం వేణు అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని తట్టుకోలేక ఖమ్మం జిల్లాకు చెందిన నిరుద్యోగి గడ్డం వేణు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్లే తన జీవితంలో ఈ దుస్థితి వచ్చిందని వేణు తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పేరుతో కాంగ్రెస్ పార్టీ యువతకు చేసిన వాగ్దానాలు, వాటి అమలులో జరిగిన మోసాన్ని కూడా వేణు తన లేఖలో ప్రస్తావించారని అన్నారు.
ఖమ్మం జిల్లా యువకుడు గడ్డం వేణు రాసిన సూసైడ్ లేఖ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై దాఖలైన ఒక ఛార్జ్‌షీట్ అని పేర్కొన్నారు. ఒకవేళ ఆ లేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందకపోతే బిఆర్‌ఎస్ తరఫున తామే పంపిస్తామని చెప్పారు. అందులోని అంశాలు చదివిన తర్వాత అయినా యువతపై కనీసం జాలి, బాధ్యతతో వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు. యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం కారణంగానే యువతలో తీవ్ర ఆగ్రహం, నిరాశ పెరుగుతోందని, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యువత ఓట్లు అడిగిన రాహుల్ గాంధీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మొత్తం 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలపడంతో పాటు 1.65 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని కెటిఆర్ గుర్తు చేశారు.
అయితే మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 10 వేల కొత్త ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, దీంతో రాష్ట్ర యువత తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతోందన్నారు. యువత ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందవద్దని, ఎవరూ ఆత్మహత్యలు లేదా బలవన్మరణాలకు పాల్పడవద్దని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. రాబోయే బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు వారి భవిష్యత్తుకు అండగా నిలిచే విధానాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులను కేవలం ఓట్ల కోసం ఉపయోగించుకోవడం కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా అలవాటే అని కెటిఆర్ విమర్శించారు. యూత్ క్యాలెండర్, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు సహా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా యువతను ఘోరంగా మోసం చేసిందని మండిపడ్డారు. ఉద్యోగాల పేరుతో అసెంబ్లీలో పెట్టింది జాబ్ క్యాలెండర్ కాదని, జాబులే లేని క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు.
రాహుల్‌గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు
ఇతర రాష్ట్రాల్లో నీతులు చెప్పే రాహుల్ గాంధీ, తన పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో విద్యార్థులపై జరుగుతున్న అన్యాయం, మోసం, అణచివేత, అక్రమ కేసులు, అరెస్టులపై ఎందుకు మాట్లాడటం లేదని కెటిఆర్ ప్రశ్నించారు. ఢిల్లీలో యువత కోసం పోరాటాలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకునే రాహుల్ గాంధీ, తెలంగాణలో సిఎం రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు, చదువుకున్న యువతను క్రిమినల్ వేస్ట్ అంటూ అవమానించినప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఇతర రాష్ట్రాల్లో యువతపై లాఠీచార్జీలు జరిగినప్పుడు స్పందించే కాంగ్రెస్ నాయకత్వం, తెలంగాణలో నిరుద్యోగులపై కేసులు పెట్టడం, పోలీసు వేధింపులు, ఆత్మహత్యాయత్నాలు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో సత్తా చాటుతున్న తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులను, లక్షలాది మంది యువ ఇంజనీర్లను అవమానించేలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలే కాంగ్రెస్ పార్టీ అసలు వైఖరికి నిదర్శనమని కెటిఆర్ విమర్శించారు. నిజంగా క్రిమినల్ వేస్ట్ ఎవరైనా ఉంటే 89 కేసులతో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డే అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని సిఎంగా చేయడమే కాంగ్రెస్ పార్టీ చేసిన క్రిమినల్ వేస్ట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి పంచిన గ్యారెంటీ కార్డులు, 13 డిక్లరేషన్లు ఇచ్చి అన్ని వర్గాలను మోసం చేయడమే అసలు క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యానించారు. విద్యార్థులను, యువతను అవమానించే అర్హత రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. రేవంత్‌రెడ్డి ఏం చదివారో అనుమానమే అని పేర్కొన్నారు. ఆయన నకల్ కొట్టి పాసైన బాపతే అయి ఉంటుందని సందేహం వ్యక్తం చేశారు.
రేవంత్ తన జీవితంలో ఎప్పుడైనా ఒక పోటీ పరీక్ష రాశారా.. కనీసం ఒక ఉద్యోగ దరఖాస్తు ఫారం నింపారా..? అని ప్రశ్నించారు. చివరకు తన ఎన్నికల అఫిడవిట్‌ను సైతం స్వయంగా నింపే తెలివి రేవంత్‌కు ఉందా..? అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో నిర్మితమైన ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలు, సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్, రూ.200 కోట్ల జూబ్లీహిల్స్ ప్యాలెస్ వంటి నిర్మాణాలన్నీ ఇంజనీర్ల ప్రతిభ ఫలితమేనని గుర్తు చేశారు. అలాంటి ఇంజనీర్లనే అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇంజనీరింగ్ విద్యార్థులు ఆయనను వదిలిపెట్టరని హెచ్చరించారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకు అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నం
రాష్ట్ర ప్రజల అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చేతిలో లేని అంశాలపై మాట్లాడుతున్నారని కెటిఆర్ విమర్శించారు. 21 ఏళ్లకే చట్టసభల్లో ప్రవేశానికి అవకాశం కల్పించాలంటూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, తెలంగాణ యువతకు యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని పేర్కొన్నారు. 21 ఏళ్ల అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసినా అది ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని, ప్రజల దృష్టి మళ్లించేందుకు చేసే అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నం తప్ప మరొకటి కాదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జెన్- జీకి చెందిన యువకుడిని విద్యాశాఖ మంత్రిగా నియమిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ బాధ్యతలను యువకుడికి అప్పగించాలని సవాల్ విసిరారు. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి సాధించిన విజయం అంటే 150 మంది గురుకుల విద్యార్థుల మరణాలా...ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగులకు ‘ఎండ్రిన్ తాగి చావండి’ అనే పరిస్థితి కల్పించడమా.. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 10 వేల కొత్త ఉద్యోగాలకే పరిమితం కావడమా..? అని ప్రశ్నించారు.
ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి
కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, యువతకు ఇచ్చిన హామీల అమలు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా చర్చ జరపాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. యువతకు చేసిన ద్రోహాన్ని అసెంబ్లీలో బిఆర్‌ఎస్ తరఫున గట్టిగా నిలదీస్తామని హెచ్చరించారు. తెలంగాణ యువతకు న్యాయం జరిగే వరకు బిఆర్‌ఎస్ వారి తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని నిలిపివేయడం రేవంత్ రెడ్డి చేతగానితనానికే నిదర్శనమని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఐటీ రంగం క్షీణించడానికి కూడా ప్రభుత్వ వైఫల్యమే కారణమని, తెలంగాణ ఐటీ ప్రగతి తిరోగమనంలోకి వెళ్లిందన్నారు. స్వయంగా మంత్రులు, ముఖ్యమంత్రి అనుచరులు పారిశ్రామికవేత్తలను బెదిరించడం, వేధింపులకు గురిచేయడం వల్ల పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారని ఆరోపించారు. దీంతో పరిశ్రమలు రావడం తగ్గిపోయి ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోయాయని పేర్కొన్నారు.
పెద్ది తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు
స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు బిఆర్‌ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తోందని కెటిఆర్ ఆరోపించారు. నర్సంపేటలో వ్యాపారులు సుదర్శన్ రెడ్డి పేరు చెప్పాలని పోలీసులు వేధించిన ఘటన వాస్తవమే అని పేర్కొన్నారు. ఆయన సివిల్ సప్లైస్ శాఖలో జరిగిన అవినీతి, విద్యాశాఖలో బంకర్ బెడ్స్ కుంభకోణాన్ని బయటపెట్టడమే కాకుండా, ఆ ఆధారాలను ఇడికి అందజేశారని చెప్పారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేసినందుకే సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. దాంతో ఆయన తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని అన్నారు. అయితే, సుదర్శన్ రెడ్డి మరణించిన మరునాడే సుప్రీంకోర్టు నుంచి నోటీసులు జారీ అవుతూ గైడెన్స్ రావడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని వ్యక్తులు ఆయన విమర్శలను తట్టుకోలేక, అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా వేధించారని ఆరోపించారు. సుదర్శన్‌రెడ్డి మరణం అత్యంత దురదృష్టకరమని కెటిఆర్ పేర్కొన్నారు.











