వర్షాకాలం ప్రారంభమైన వెంటనే దోమలు, కలుషిత నీరు, తేమ వాతావరణం కారణంగా అనేక అంటువ్యాధులు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డెంగ్యూ, వైరల్ ఫీవర్, టైఫాయిడ్, జలుబు, దగ్గు, కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్లు ఈ సీజన్‌లో ఎక్కువగా కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన పరిశుభ్రత పాటించడం, స్వచ్ఛమైన నీరు తాగడం, దోమల నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని సూచిస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఏమిటి? వాటి బారిన పడకుండా తెసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దామా?



వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే వ్యాధులు

1. డెంగ్యూ: అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్ల నొప్పులు, శరీరంపై దద్దుర్లు కనిపించవచ్చు.

2. వైరల్ ఫీవర్ (ఫ్లూ): జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, జలుబు, శరీర నొప్పులు ప్రధాన లక్షణాలు.

3. టైఫాయిడ్: కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది. అధిక జ్వరం, కడుపు నొప్పి, అలసట కనిపిస్తాయి.

4. జలుబు, దగ్గు: వాతావరణ మార్పులు, వైరస్‌ల వల్ల శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయి.

5. కలరా, విరేచనాలు: కలుషిత నీరు, ఆహారం వల్ల విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్‌కు దారితీస్తాయి.

6. లెప్టోస్పిరోసిస్: వరద నీటితో సంబంధం ఉన్నప్పుడు వచ్చే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. జ్వరం, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపించవచ్చు.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

1. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి.

2. దోమతెరలు, దోమల నివారణ క్రీములు లేదా స్ప్రేలు ఉపయోగించాలి.

3. మరిగించి లేదా శుద్ధి చేసిన నీటినే తాగాలి.

4. బయట అపరిశుభ్రమైన ఆహారాన్ని నివారించాలి.

5. చేతులను తరచుగా సబ్బుతో కడుక్కోవాలి.

6. వర్షంలో తడిస్తే వెంటనే పొడి దుస్తులు ధరించాలి.

7. జ్వరం రెండు రోజులకుపైగా కొనసాగితే స్వయంగా మందులు వాడకుండా వైద్యుడిని సంప్రదించాలి.