రాంచీ: జార్ఖండ్‌లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సుజిత్ సిన్హా పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. సాహిబ్‌గంజ్ డివిజినల్ జైలు నుంచి కన్‌బాద్‌కు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మార్గమధ్యలో సుజిత్ మరుగుదొడ్డికి వెళ్లాలని కోరడంతో పోలీసులు వాహనం ఆపారు. అదే అదనుగా భావించిన అతడు ఓ పోలీసు వద్ద ఉన్న రైఫిల్‌ను లాక్కొని చీకట్లోకి పరిగెత్తాడు. ఈ క్రమంలో అతడు పోలీసులపై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు చేపట్టగా.. అతడు తీవ్ర గాయాలపాలైనట్లు వెల్లడించారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఘటన అనంతరం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజన్ చేశారు. ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని ఘటనపై సమీక్ష నిర్వహించారు. సుజిత్ సిన్హాపై హత్యలు, వసూళ్లు, ఇతర నేరాలకు సంబంధించిన అనేక కేసులు నమోదై ఉన్నాయి. చాలా కాలంగా అతడు జార్ఖండ్ పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.