జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. సోమవారం ఉదయమే 60 మంది అధికారులు 8 గ్రూపులుగా చేరుకుని కార్యాలయంలోని అన్ని విభాగాలను తనిఖీలు చేశారు. అయితే ఇంటి అనుమతులు, పన్నుల వసూళ్లలో అనినీతి ఆరోపణలపై ఈ నెల 7న ఎసిబి అధికారులు తనిఖీలు నిర్వహించి అవకతవకలు జరిగినట్లు వెల్లడించారు. ఎసిబి అధికారుల సూచనతో ఈ తనిఖీలు జరిగిన్నట్లు తెలుస్తోంది. అయితే దుకాణాల అద్దెలు, ఇంటి పన్నుల్లో తేడాలపై కొలతలు తీస్తూ విచారణ జరిపారు.

జగిత్యాల మున్సిపల్ శాఖ 2019 నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుండగా, 2019 నుంచి 16 మంది కమీషనరన్లు బదిలీ కాగా అవినీతి ఆరోపణలపై 8 మంది జైలు కెళ్ళారు. గతంలోనూ రెండు సార్లు ఎసిబి, రెండు సార్లు విజిలెన్స్ అధికారుల సోదాలు జరిగాయి. తాజాగా విజిలెన్స్ అధికారుల సోదాలతో మరోసారి జగిత్యాల మున్సిపల్ కార్యాలయం వార్తల్లో నిలిచింది. అన్ని విభాగాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించామని, లెక్కలన్నీ తేలిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.