
పద్దెనిమిదవ శతాబ్దంలో సైన్స్ పాఠాలు చెప్పిన జంతర్ మంతర్ ఇపుడు సామాజిక పాఠాలు చెప్తున్నది. అధికారపక్షానికి, ప్రతిపక్షాలకు రాజకీయ పాఠాలు కూడా. జంతర్ మంతర్ ఆందోళన ప్రస్తుత దశ ముగియవచ్చు. అయినా పాఠాలు కొనసాగుతున్నాయి. ఇది పరిశీలకులకు తోస్తున్న మాట మాత్రమే కాదు. కాక్రోచ్ జనతా పార్టీ పేరిట సరికొత్త చైతన్యాలు చూపిన యువతరం, తమ ఉద్యమం ఇంతటితో ముగియలేదని, భవిష్యత్తులోకి చాలా దూరం ప్రయాణించవలసి ఉన్నదని, ప్రయాణించగలమని, ప్రస్తుతానికి ఇది ఒక మజిలీ మాత్రమేనని స్వయంగా పదే పదే ప్రకటిస్తున్నారు.
ప్రధానంగా విద్యారంగ సమస్యలతో ఆరంభించిన కాక్రోచ్ యువతరం, అందుకు మాత్రమే పరిమితం కాకుండా అనేక ఇతర సామాజిక అంశాలను కూడా ప్రస్తావిస్తుండటం గమనార్హమైన విషయం. ఇటువంటి ధోరణి కొంతవరకు వామపక్ష విద్యార్థి సంఘాలలో ఉండటం తెలిసిందే కాగా, అటువంటి మొగ్గు ఏమీ ప్రకటిత రూపంలో లేని ఒక సరికొత్త వేదిక నాయకత్వాన కనిపించటం ఒకటైతే, అసలు మొత్తం విద్వార్థి లోకానికి, యువజన లోకానికి వ్యాపించి కనిపించటం గమనించదగ విశేషం. వారు ఒకవైపు విద్యా వ్యవస్థను, మరొక వైపు రాజకీయ వ్యవస్థను కూడా ప్రశ్నించటం గమనించదగ్గది.
కాక్రోచ్ తక్షణ ఆందోళనకు ప్రేరణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన అవమానకర వ్యాఖ్యలన్నది తెలిసిందే. అదే కాక్రోచ్‌ను తమ పేరుగా తీసుకున్న యువకులు వెంటనే లేవనెత్తిన ప్రశ్నలను చూడండి. బొద్దింకలు మురికినుంచి పుట్టుకు వచ్చే అనారోగ్యకరమైన కీటకాలన్నది నిజమేగాని, మన వ్యవస్థ మురికిగా తయారు కావటం వల్లనే ఇది జరుగుతున్నది. మరి ఈ మురికి వ్యవస్థకు బాధ్యత ఎవరికి? బొద్దింకలదా లేక ఆ మురికి వ్యవస్థను సృష్టించిన వారిదా? తన వ్యాఖ్యలు పట్ల నిరసన రావటంతో ప్రధాన న్యాయమూర్తి వివరణ ఇవ్య బూనారుగాని అది చెల్లుబాటు కాలేదు. ఎందుకంటే తను నకిలీ లా డిగ్రీల వారిని ఉద్దేశించి ఆ వ్యాఖ్య చేసిన మాట నిజమే అయినా, ఈ దేశపు యువతరం ఎటువంటి వ్యవస్థలో, ఎటువంటి జీవిత పరిస్థితుల కారణంగా, ఇటువంటి మార్గాలను అనుసరించవలసిన విధిలేని స్థితి ఏర్పడుతున్నది?
దీని అర్థం వారు ఈ మార్గాన్ని అనుసరించ వలసి రావటం సరైనదని కాదు. అందువల్ల తాత్కాలికంగా వారికి, వ్యవస్థకు కొంత హాని కలుగుతుందన్నది నిర్వివాదాంశం. అదే సమయంలో కార్యకారణ సంబంధం అనే దానిని విస్మరించి, ఈ మురికి వ్యవస్థకు బలి అవుతున్న వారిన్ని తమ మార్గమే సరైనది కాదని కోర్టులు నిందించటం సరైనదవుతుందా? అందువల్ల సమస్య పరిష్కారమవుతుందా? సమస్యను పరిష్కరించవలసింది కోర్టులని యువతరం ఏమీ అనటం లేదు. కాని కోర్టు వ్యాఖ్యను ఆధారంగా తీసుకుని వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు. పార్టీలను, ప్రభుత్వాలను సవాలు చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్నే కాదు. అన్ని పార్టీలనూ. ఎందుకంటే పరీక్షలు, విద్య ఈ విధంగా ఉండటానికి అందరూ బాధ్యులే. అందరూ ఏవో ఒక దశలో కేంద్రంలోనో, రాష్ట్రాలలోనో పరిపాలించిన వారే, పరిపాలిస్తున్నవారే. ఇదే ఆందోళన సందర్భంగా యువతరం, అసలు మన దేశంలో విద్యారంగం మొదటి నుంచి ఎట్లా ఉంది? మన కళ్లముందే అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలలో ఏవిధంగా అమలవుతున్నది? ఇక్కడ మెరుగైన విద్య ఖరీదుగా మారి కొన్ని వర్గాలకు అందుబాటులో ఉండగా, తక్కిన విస్తృతమైన వర్గాలు ఇన్ని దశాబ్దాలు గడిచినా ఎందుకు వెనుకబడి ఉన్నాయి? ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగా మారుతుండటానికి బాధ్యులెవరు? అని ప్రశ్నిస్తూ ఇదంతా మారాలంటున్నారు.
ఆసక్తికరంగా ఆ స్థితిని వారు దేశంలోని పేదరికానికి, ధనికపేద తారతమ్యాలకు, ప్రభుత్వాల విధానాలవల్ల కొందరు సూపర్ రిచ్‌గా మారుతుండటానికి ముడిబెట్టి చర్చిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నీ తక్షణ సందర్భంలో కేంద్రంలోని అధికార పక్షానికి సంబంధించిన అయినా, అన్ని పార్టీలకూ వేయటం కనిపించింది. ఇవన్నీ చదువులతో ఆరంభించి దేశంలోని పేదరికం వరకు మొత్తం వ్యవస్థతో నిమిత్తంగల సామాజిక ప్రశ్నలు, పాఠాలు అవుతున్నాయి. ఇది అన్ని పార్టీలూ గురైరగాలి. అట్లాగాక, ఈ యువతరం వెల్లువ తమకు రాజకీయంగా ఉపయోగపడగలదని భావించి అందుకోసం ప్రయత్నించినట్లయితే అది, రేపు తమకు కూడా ఎదురు తిరగగలదు. ఈ మాట కేవలం ఊహాగానం కాదు. ఆందోళన సాగిన రోజులలో వేలాదిగా వెలువడిన సోషల్ మీడియా పోస్టులలో నాయకులుగాని, సాధారణ విద్యార్థులు గాని చేసిన వ్యాఖ్యలు తగినన్ని గమనించిన వారు ఈ మాట గుర్తించే ఉంటారు.
కాక్రోచ్‌లు చేసింది నీట్‌కు సంబంధించిన నిరసన మాత్రమే కాదు. వారు అనేక ఇతర అంశాలను కూడా అదే క్రమంలో రగిలించారు. ఉదాహరణకు ఒకటి గమనించండి. అభిజిత్ దీప్కే మొదటి రోజున జంతర్ మంతర్‌కు చేరినపుడే ఎత్తిచూపిన విషయాలలో ఒకటి, ఎంత కాలం హిందూ ముస్లిం, ఇండియా పాకిస్థాన్ ప్రచారాలతో యువతరాన్ని భ్రమపెడతారని. అది చాలా సాహసంతో కూడిన మాట. అటువంటి ప్రచారాలు యువతకు చేసిన మేలేమిటి? రాజకీయాల కోసం ఉపయోగపడటం తప్ప? అన్నవి ఆయన ప్రశ్నలు. బిజెపి ప్రచారాల ఉద్దేశం రహస్యం కాదు. కాని ఈ ప్రశ్నలు లేవనెత్తటానికి ప్రతిపక్షాలు సైతం భయపడుతూ వచ్చాయ. ఒకవైపు ఈ నినాదాల ప్రభావంతో ప్రజలలో, యువతలో మతతత్వ ధోరణి పెరుగుతున్నందున ఆ నినాదాలను ప్రశ్నించినట్లయితే తమకు హిందువుల ఓట్లు పోవచ్చునన్నది ఇతర పార్టీల భయం.కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి సాగుతున్నది. అది బిజెపికి అనుకూలంగా మారుతున్నది. కొన్ని ప్రతిపక్షాలు సాఫ్ట్ హిందూత్వ కార్డును ఉపయోగించజూస్తున్నాయిగాని పనిచేయటం లేదు. హిందూత్వపై ట్రేడ్‌మార్క్ బిజెపిదిగా మారిన పరిస్థితికి ఫలితమది. విశేషమేమంటే చివరకు వామపక్షాలు కూడా ఈ భయానికి మినహాయింపు కాలేకపోయాయి.
ఇటువంటి స్థితిలో అభిజిత్ చేసిన వ్యాఖ్యలు ఎంత సాహసంతో కూడినవో అర్థం చేసుకోవచ్చు. అదే ఒక సామాజిక విశేషమంటే ఆ వైఖరి మొత్తం జంతర్ మంతర్ యువ సందోహానికి వ్యాపించటం మరింత విశేషంగా మారింది. ఆమేరకు గల అనేక వీడియోలను చాలా మంది గమనించి ఉంటారు. అభిషేక్ మాటలనే వందలాది యువతీయువకులు అంటూపోయారు. ఈ ప్రశ్నలు క్రమంగా దేశవ్యాప్తమవుతున్నాయి. తమ కుటుంబమంతా బిజెపి అని, తాము కూడా ఇంతకుముందు వరకు ఆ పార్టీ మద్దాతుదారులమని, ఇకముందు ఆ పని చేయబోమని అనటమే గాక, తమ పెద్దలు కాదన్నా తమ వైఖరి ఇదేనన్నారు. సరైన విద్య, సరైన పాలన ఇవ్వలేక ఈ తరహా మతప్రచారాలు, అదంతా చాలదన్నట్లు నీట్ గురించి ప్రశ్నించిన యువతపై ఈ తరహా దమనకాండ ఏమిటన్న విమర్శలు వారి నుంచి వినిపించాయి. ఇదంతా బిజెపిని కలవరపెడుతున్నది.
రెండు వార్తలు ఈ స్థితిని పరాకాష్ఠకు తీసుకు వెళ్లాయి. ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ ది ఒడిశా కాగా, ఆ రాష్ట్రానికి చెందిన ఒక బిజెపి మహిళ ఎం.పి కుమార్తె బహిరంగంగా కాక్రోచ్ ఆందోళనలో పాల్గొని మోడీ ప్రభుత్వాన్ని వీడియోలో విమర్శించటం. దానితో గాభరా పడిన ఢిల్లీలోని పార్టీ నాయకత్వం ఆ యూట్యూబ్ పోస్ట్‌ను తొలగించి క్షమాపణలు చెప్పించాలని ఆ ఎంపికి సూచించగా, అందుకు ఆ యువతి నిరాకరించటం. అసోంలోనయితే ఒక బిజెపి మంత్రి కుమార్తె అదే విధంగా కాక్రోచ్ ఆందోళనలో పాల్గొని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించి వెనుకకు తగ్గేందుకు నిరాకరించింది.
బిజెపి మతతత్వ ధోరణితో స్వయంగా ఆ పార్టీకే చెందిన యువత ఏ విధంగా విసుగెత్తిపోయిందా చెప్పటానికి ఇవి రెండు ప్రత్యేకమైన దృష్టాంతాలు. జంతర్ మంతర్ వద్ద చేరిన వారెందరో, ఈ దేశ ప్రజలంతా ఒకటని, అందరి సమస్యలు ఒకటేనని, వాటి పరిష్కారానికి ప్రయత్నించకుండా ఈ తరహా ప్రచారాలు చేయటం తమను తప్పుదారి పట్టించి ఓట్లు సంపాదించేందుకు మాత్రమేననటం ఎందరో గమనించి ఉంటారు. బిజెపి ప్రచారాయుధాలలో ఈ నినాదాలు ఒకటై, ముఖ్యంగా యువతరాన్ని ప్రభావితం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్న స్థితిలో, అదే యువతరం నుంచి ఇటువంటి వ్యతిరేకత కనిపించటం ఆ పార్టీ నాయకత్వాన్ని తీవ్రమైన కలవరపాటుకు గురిచేసి ఉంటుంది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మరింత ప్రమాదకరం కాగలదన్న జంకు కూడా నాయకత్వాన్ని రాజీపడేట్లు చేసి ఉంటుంది.
ఈ ఒత్తిడికి అదనంగా చేరింది మరొకటి ఉంది. అది, ఆందోళనకారులను మొదటినుంచే టెర్రరిస్టులు, పాకిస్థాన్ ఏజెంట్లు, దేశద్రోహులు, హిందూ వ్యతిరేకులు, వారికి బయటినుంచి నిధులు వస్తున్నాయనే మాటలు. అదంతా కూడా హిందూ ముస్లిం, మందిర్ మస్జిత్, ఇండియా పాకిస్థాన్ షరా మామూలు ప్రచారపు ఫ్రేమ్ వర్క్‌లో భాగమని గ్రహించేందుకు యువతీ యువకులకు ఎక్కువ సమయం పట్టలేదు. దానితో ఒకవైపు బిజెపి వ్యతిరేకత పెరగటంతోపాటు, మత తారతమ్యాలు లేకుండా భారతీయులంతా ఒకటేనన్న భావం వేగంగా బలపడింది. అందువల్ల బిజెపి వ్యూహం రైతుల ఆందోళన సమయంలో బెడిసిన దాని కన్న చాలా ఎక్కువగా జంతర్ మంతర్ ఆందోళన సందర్భంగా అక్కడనే గాక దేశమంతటా బెడిసికొట్టింది. ‘గోడీ మీడియా’ అనబడేది సాగించిన ఇదే తరహా విషప్రచారం అగ్నికి ఆజ్యంవలే తోడైంది.
కాక్రోచ్ నాయకత్వం, జంతర్ మంతర్ వద్ద రోజూ వేలకు వేలుగా చేరిన యువతీ యువకులు పంపిన సామాజిక సందేశాలు ఎన్నో ఉన్నాయి. పూర్తిగా శాంతి యుతంగా ఉద్యమ నిర్వహణ, వందలాది మంది యువతులు పాల్గొంటున్నప్పటికీ ఎటువంటి ఇబ్బంది కర పరిస్థితులు సృష్టించకపోవటం ఎవరిది ఏ మతం, ఏ పార్టీ అన్న ప్రస్తావనలు లేశమాత్రమైనా రాకపోవటం, యువతరం అజెండా మంచి విద్య, అభివృద్ధి, మతాలతో నిమిత్తం లేని ప్రగతిశీల దృష్టి మాత్రమే కావాలన్నది ఆ సామాజిక సందేశాలలో కొన్ని మాత్రమే. వీరిపై దేశసమాజం ఆశలు పెట్టుకోవచ్చు.
- టంకశాల అశోక్ (దూరదృష్టి)
(రచయిత సీనియర్ సంపాదకులు)










