
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో శుక్రవారంనాడు మరో కీలక బిల్లుకు ఆమోదం లభించింది. విద్యార్థులపై పోలీసు చర్యను నిరసిస్తూ విపక్ష ఎంపీలు చేపట్టిన ఆందోళనల మధ్య ఎలాంటి చర్చా జరక్కుండానే ‘జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు-2026’ను కేంద్రం ఆమోదింపజేసుకుంది. తొలుత ఈ బిల్లుపై చర్చను ప్రారంభించి, ఆమోదించాల్సిందిగా సభాపతి స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ దిలీప్ సైకియా సభ్యులను కోరారు. అయితే విపక్ష సభ్యులు విద్యార్థుల నిరసనపై జరిగిన పోలీసు చర్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ,
హోం మంత్రి అమిత్‌షా సభకు రావాలంటూ పట్టుపట్టారు. దీంతో బిల్లు ఎలాంటి చర్చకు నోచుకోకుండా మూజువాణి ఓటుతో సభామోదం పొందింది. చర్చకు నిరాకరించిన విపక్ష సభ్యుల ప్రవర్తనపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామం దురదృష్టకరమని, విపక్షాలు మునుముందు ఇలాంటివి జరక్కుండా చూసుకోవాలని, పార్లమెంటుకు పంపిన ప్రజలకు జవాబుకు చెప్పుకోవాల్సి ఉంటుందని అన్నారు. అనంతరం బిల్లు ఆమోదం పొందగానే సభ సోమవారంనాటికి వాయిదా పడింది.











