కొత్త పథకం ద్వారా 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా రక్షణ

మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు

27న సోలార్ ప్లాంట్ల పథకం ప్రారంభం

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెల్లడి

మన తెలంగాణ/ ఖమ్మం బ్యూరో: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా చారిత్రాత్మక ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. కులమతాలకతీతంగా, పేద, ధనిక భేదం లేకుండా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు ఈ బీమా రక్షణ కవచంలా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఆదివారం ఖమ్మం నగరంలో జరిగిన సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా అభినందన సభలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో పాటు భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు కనీసం రూ.లక్ష సాయం కోసం చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేకపోయిందని భట్టి విమర్శించారు. అటువంటి దుస్థితి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే, ప్రమాదవశాత్తు కుటుంబ యజమానిని కోల్పోయిన ప్రతి ఇంటికీ రూ.5 లక్షల బీమా వర్తింపజేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు. దీనికి సంబంధించి అధికారులు త్వరలోనే ప్రతి ఇంటికీ వచ్చి వివరాలు సేకరిస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు.

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా ఉచిత బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

27న సోలార్ పవర్ ప్లాంట్ల పథకం ప్రారంభం

మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అందులో భాగంగా ఈ నెల 27వ మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం రాజుపాలెం గ్రామంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు కేటాయించే పథకాన్ని ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. మహిళా సంఘాలకు ఏటా రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అవసరమైతే దీనిని రూ.లక్ష కోట్లకు పెంచుతామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని తెలిపారు. త్వరలోనే మహిళా వ్యాపారవేత్తల కోసం ప్రత్యేకంగా 550 ఆర్టీసీ బస్సులను కేటాయించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. మార్కెట్లో కిలో రూ.50-55 పలుకుతున్న మేలురకం సన్నబియ్యాన్ని రాష్ట్రంలోని కోటి 6 లక్షల కుటుంబాలకు ఉచితంగా అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని సగర్వంగా ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతి మనిషికి 6 కేజీల చొప్పున నేరుగా పేదల ఇళ్లకే సన్నబియ్యాన్ని పంపిస్తామని చెప్పారు.

ప్రతి గింజను కొంటాం

రైతులు పండించిన ప్రతి మొక్కజొన్న గింజను, ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని రైతులకు ఉప ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. దేశంలో ఎక్కడా మొక్కజొన్న కొనుగోళ్లు జరుగకపోయినా, తెలంగాణలో పండిన ప్రతి మొక్కజొన్న గింజను, ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులను ఆదుకుంటోందన్నారు. రైతుల అవసరాల కోసం క్యాబినెట్‌లో చర్చించి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ప్రతి పక్షాల కుట్రలను తిప్పికొట్టండి

ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, అటువంటి కుట్రలను కార్యకర్తలు తిప్పికొట్టాలని భట్టి పిలుపునిచ్చారు. త్వరలోనే ప్రభుత్వ పథకాలపై ఇంటింటికీ కరప్రతాలను పంపిణీ చేస్తామని, కాంగ్రెస్ కార్యకర్తలు గర్వంగా, తలెత్తుకొని గ్రామాల్లో పర్యటించి ప్రజలకు వాస్తవాలు వివరించాలని భట్టి విక్రమార్క కోరారు. ‘మేము ప్రజలకు మాట ఇచ్చాం, ఈ రోజు చేసి చూపిస్తున్నాం’ అని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్లి చెప్పేలా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.