మన తెలంగాణ / హైదరాబాద్: భారత స్వాతంత్య్ర దినోత్సవ 80వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ఆర్‌పిఎఫ్ బ్యాండ్ బృందం ఆదివారం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో అద్భుతమైన సంగీత ప్రదర్శన ఇచ్చింది. 12 మంది సభ్యుల ఆర్‌పిఎఫ్ బ్యాండ్ బృందం దేశభక్తి గీతాలు, ప్రజాదరణ పొందిన పాటలు, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల స్ఫూర్తితో నిర్వహించిన ఈ ప్రదర్శనలో బ్యాండ్ బృందం పలు దేశభక్తి గీతాలతో పాటు జనాదరణ పొందిన పాటలను ప్రదర్శించి ప్రయాణికులను, ప్రేక్షకులను అలరించింది.

ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు స్టేషన్ ప్రాంగణానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రదర్శకుల కృషిని అందరూ అభినందించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.