న్యూఢిల్లీ : కాక్రోచ్ చీఫ్ అభిజిత్ దీప్కే రానున్న ఎన్నికల్లో భీమ్ ఆర్మీ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే జోస్యం చెప్పారు. ప్రతి ప్రజా ఉద్యమం రాజకీయ నాయకులను తయారు చేస్తుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం కూడా ప్రధాని నరేంద్రమోడీయే తమ నాయకుడుగా భావిస్తోందని, సమస్యల పరిష్కారం కోసం మోడీ వైపు చూస్తోందని పేర్కొన్నారు.

“ప్రతి ప్రజా ఉద్యమం రాజకీయ నాయకులను తయారు చేస్తుంది. జెపీ ఉద్యమం లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నాయకులను తయారు చేసింది. అన్నా హజారే ఉద్యమం నుంచి కేజ్రీవాల్ నాయకుడయ్యారు” అని ఆయన ఉదహరించారు. నేపాల్‌లో కూడా ఎవరైతే జెన్ జెడ్ ఉద్యమంతో పాలుపంచుకున్నారో వారు రాజకీయ పార్టీలో చేరడం తప్పనిసరి అయ్యిందన్నారు.

ఎన్‌డిఎ పార్లమెంటరీ సమావేశంలో మంగళవారం ప్రధాని మోడీ యువతకు సంబంధించిన సమస్యలపై మాట్లాడారని ప్రస్తావించారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసుల పాశవిక చర్యలకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేయడాన్ని అడగ్గా , దానికి బదులు కాంగ్రెస్ 1975లో ఎమర్జెన్సీ విధించినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి ఉందని వ్యాఖ్యానించారు.