
నిరసనకారులపై లాఠీచార్జీ, టియర్‌గ్యాస్ ప్రయోగం
అడ్డంకులు దాటుకుని పార్లమెంట్‌వైపు ఆందోళనకారులు
సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ నిలిపివేత
20వేల మందికిపైగా తరలివచ్చిన సిజెపి మద్దతుదారులు
తోపులాటల్లో పోలీసులు, నిరనసకారులకు గాయాలు
పలువురిని అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు
న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ(సిజెపి) చలో పార్లమెంట్ ఉద్రిక్తతకు దారితీసింది. నీట్‌లో అవకతవకలు, కేంద్ర మంత్రి ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా సహా పలు డిమాండ్లతో సోమవారంనాడు పార్లమెంట్ సమావేశాలు మొదలైన రోజే సుమారు 20వేల మందికిపైగా సిజెపి మద్దతుదారులు అటువైపుగా దూసుకెళ్లారు. తొలుత జంతర్‌మంతర్ వద్దే ఆందోళనకారులను అడ్డుకునేందుకు అడుగుడుగనా భద్రతా దళాలు, బారికేడ్లను మోహరించారు. పోలీసులు పార్లమెంట్ మార్చ్‌కు అనుమతి ఇవ్వకపోయినా విద్యార్థులు, నిరసనకారులు లెక్కచేయకుండా ముందుకే కదిలారు. పోలీసులు ఎంత అడ్డుకునేందుకు ప్రయత్నించినా ప్రతిఘటించండంతో పోలీసులు లాఠీలు ఝలిపించారు. టియర్ గ్యాస్‌ను కూడా ప్రయోగించారు.
ఈ క్రమంలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రతా బలగాలకు, నిరసనకారులకు నడుమ జరిగిన ఘర్షణలు, తోపులాటల్లో ఇరు పక్షాల్లో కొందరికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. అయినప్పటికీ వేర్వేరు మార్గల ద్వారా పార్లమెంట్ సమీపం వరకు నిరసనకారులు వెళ్లగలిగారు. మరోవైపు పుకార్లు వ్యాప్తి చెందకుండా సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. పార్లమెంట్ సమీపంలోని హై సెక్యూరిటీ ఏరియాలో కొంతసేపు పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఉద్రిక్తత తలెత్తింది. జంతర్‌మంతర్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, రైల్వే క్లబ్, శాస్త్రి భవన్, జన్‌పథ్, కన్నాట్‌ప్లేస్, ఆర్‌బిఐ తదితర ప్రాంతాల్లో భద్రతా బలగాల అడ్డంకులను దాటుకుని హై సెక్యూరిటీ జోన్‌లోకి ప్రవేశించేందుకు విశ్వప్రయత్నం చేశారు. శాస్త్రిభవన్ వద్ద పోలీసులు నిరసనకారులపైకి టియర్‌గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ విస్టా వద్ద రాకపోకలను నిలిపివేశారు. సిజెపి చీఫ్ అభిజిత్ దీప్కేను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే పోలీసులు దీన్ని తోసిపుచ్చారు.
మెట్రో స్టేషన్ల వద్ద మోహరింపులు..
మార్చ్‌ను అదుపులోకి తీసుకురావడానికి నిరసనకారులు పార్లమెంటు వైపు ముందుకు సాగకుండా నిరోధించడానికి, అధికారులు రైల్ భవన్, శాస్త్రి భవన్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, జనపథ్, కన్నాట్ ప్లేస్ ఇతర సున్నితమైన ప్రదేశాల చుట్టూ ఉన్న కీలక కూడళ్ల వద్ద వజ్ర అల్లర్ల నిరోధక వాహనాలు, వాటర్ కెనాన్లు, ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను మోహరించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా అధికారులు మెట్రో ప్రవేశాన్ని పరిమితం చేసి, స్టేషన్ గేట్లను తాత్కాలికంగా మూసివేయడంతో సమీపంలోని ఢిల్లీ మెట్రో స్టేషన్లలో పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఢిలీ వ్యాప్తంగా మెట్రో స్టేషన్ల వద్ద భద్రతను కూడా కట్టుదిట్టం చేసి నిఘా ఉంచారు.
సిజెపి ఆందోళన వేదిక ధ్వంసం...
మరోవైపు జంతర్‌మంతర్ వద్ద సిజెపి నిరసన వేదికను పోలీసులు పూర్తిగా ధ్వంసం చేశారు. ట్రాంపోలైన్స్, కార్పెట్లు, ఇతర సామాగ్రిని అక్కడిని తొలగించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని, పోలీసుల చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సిజెపి ప్రతినిధుల్లో ఒకరు స్పష్టం చేశారు.











