కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం అని, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారణం కూడా బిఆర్‌ఎస్సేనని రాష్ట్ర నీటిపారుదల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ పాలనలో జరిగిన చారిత్రక వైఫల్యాన్ని దాచిపెట్టేందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్‌ఎస్ పార్టీ బురద జల్లడం, అధికారులను బలిపశ-వులుగా చూపించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం చేస్తుందని మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రస్తుతం నిర్మాణపరంగా అసురక్షిత స్థితిలో ఉ-న్నాయని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ స్పష్టంగా హెచ్చరించినప్పటికీ, వెంటనే కన్నెపల్లి పంపులను నడిపి వాటిలో నీటిని నిల్వ చేయాలని బిఆర్‌ఎస్ డిమాండ్ చేయడం అత్యంత ప్రమాదకరమని ఆయనహెచ్చరించారు. 2023, అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన సమయంలో సీఎం కేసీఆర్ ఉ-న్నారని,

అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదని గుర్తుచేశారు. 2023, డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే నాటికే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని గుర్తుచేశారు. 2019లో ప్రారంభించిన కొద్ది కాలానికే మేడిగడ్డ బ్యారేజీలో లీకేజీలు, సీపేజ్, నిర్మాణపరమైన లోపాలు బయటపడినా క్షేత్రస్థాయి ఇంజినీర్లు పలుమార్లు హెచ్చరించినా బిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సకాలంలో మరమ్మతులు చేయకపోవడం, నాణ్యత నియంత్రణలో వైఫల్యం, నిర్లక్ష్య ధోరణి కారణంగానే చివరికి బ్యారేజీ కుంగిపోయిందన్నారు. బ్యారేజీ కుంగిన మూడు రోజులకే ఎన్‌డీఎస్‌ఏ పరిశీలించి సమర్పించిన నివేదికలో రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ, నాణ్యత నియంత్రణ, భూగర్భ పరిశోధనలు, డ్యాం భద్రతా ప్రమాణాల అమలులో తీవ్ర లోపాలు-న్నాయని స్పష్టంగా పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు. ఇలాంటి అధికారిక నివేదికలను పక్కనపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం బీఆర్‌ఎస్ రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు.