గ్లాస్గో: స్కాట్లాండ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అంచనాలకు మించి రాణించింది. భారత్‌కు పతకాల పంట పండించే రెజ్లింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్ పోటీలకు ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో చోటు దక్కలేదు. దీంతో భారత్‌కు ఈ పోటీల్లో పతకాలు లభించడం అంత సులువు కాదని విశ్లేషకులు సయితం అభిప్రాయపడ్డారు. కానీ భారత్ మాత్రం అసాధారణ ఆటతో అలరించింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగినా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి సత్తా చాటింది. బాక్సింగ్, జూడో, అథ్లెటిక్స్‌లో భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ రెండు విభాగాల్లో భారత్ స్వర్ణాల పంట పండించింది. అంతేగాక వెయిట్‌లిఫ్టింగ్‌లో కూడా పెద్ద సంఖ్యలో పతకాలను గెలుచుకుంది.

బాక్సింగ్‌లో అయితే ఏకంగా ఏడు పసిడి పతకాలు సాధించి ఔరా అనిపించింది. బాక్సింగ్‌లో సాక్షి చౌదరి, ప్రీతి పవార్, జస్మయిన్ లంబోరియా, ప్రియా ఘంఘాస్, అరుంధతి చౌదరి, సచిన్, అంకుష్ పంఘల్ స్వర్ణ పతకాలు సాధించి భారత జెండాను రెపరెపలాడించారు. అంతేగాక లవ్లీనా బొర్గాహెయిన్, నరేందర్, జడుమణి సింగ్‌లు రజతాలు సాధించారు. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను పసిడితో మెరిసింది. జూడోలో హర్ష్ సింగ్, అస్మితలు స్వర్ణాలు సొంతం చేసుకున్నారు.

పారా అథ్లెటిక్స్‌లో దిలీప్ గావిట్, షర్మిలా ధన్‌కర్‌లు పసిడి పతకాలు గెలిచి దేశ ఖ్యాతిని ఇనుమడింప చేశారు. స్కాట్లాండ్ ఆతిథ్యం ఇచ్చిన కామన్వెల్త్ క్రీడల్లో 74 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి భారత్ ఓవరాల్ 39 పతకాలు గెలిచి నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు మరో 9 కాంస్య పతకాలను గెలుచుకుంది. ఆస్ట్రేలియా 68 స్వర్ణాలు, 41 రజతాలు, 54 కాంస్యలతో ఏకంగా 163 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ 27 పసిడి పతకాలతో రెండో, కెనడా 18 స్వర్ణాలతో మూడో స్థానాన్ని దక్కించుకుంది.