దేవాలయాలకు వెళితే క్షుద్ర పూజలు చేశారని దుష్ప్రచారం చేస్తున్నారు

నిర్ణీత గడువులోగా క్షమాపణలు చెప్పాలి

లేకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం

లీగల్ నోటీసులో హరీష్ రావు హెచ్చరిక

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు లీగల్ నోటీసులు పంపించారు. దేవాలయాలకు వెళితే క్షుద్ర పూజలు చేశారని దుష్ప్రచారం చేస్తున్నారని, క్షమాపణలు చెప్పకుంటే క్రిమినల్ కేసు పెడతామని లీగల్ నోటీసులో స్పష్టం చేశారు. ఎంతో కాలంగా రాజకీయాల్లో మచ్చలేని పేరు తెచ్చుకున్న హరీశ్ రావుపై ఉద్దేశపూర్వకంగానే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజల్లో ఆయనకున్న మంచి పేరును చెడగొట్టాలనే కుట్రతోనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేశారని హరీష్‌రావు న్యాయవాది లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు కావాలనే ఈ దుష్ప్రచారానికి తెరతీశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, తద్వారా కరువు రావాలనే ఉద్దేశంతోనే హరీశ్ రావు దేవాలయాలకు వెళ్లి క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేశారంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడటాన్ని నోటీసులో న్యాయవాది తీవ్రంగా ఆక్షేపించారు.

పుట్టినరోజు వచ్చినా, మొక్కులు తీర్చుకోవాలన్నా కుటుంబ సమేతంగా గుడికి వెళ్లడం మన సంప్రదాయం అని, అలా భక్తిశ్రద్ధలతో గుడికి వెళ్లిన విషయాన్ని వక్రీకరించి.. దేవుళ్లను, పవిత్రమైన దేవాలయాలను సైతం తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం వారి సంకుచిత బుద్ధికి నిదర్శనమని అన్నారు. ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనని నోటీసుల్లో స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే కక్షగట్టి.. బిఆర్‌ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యక్తిత్వ హననం చేస్తోందని పేర్కొన్నారు.

ఆధారాలు లేకుండా చేసిన ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏయే వార్తా ఛానెళ్లు, ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ ఆరోపణలు చేశారో.. అదే మాధ్యమాల ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే సోషల్ మీడియా, వెబ్‌సైట్లు, ప్రెస్ ఆర్కైవ్స్, ఇతర డిజిటల్ లేదా ప్రింట్ ప్లాట్‌ఫామ్స్ నుంచి ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను, పోస్టులను తక్షణమే తొలగించాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు. నిర్ణీత గడువులోగా క్షమాపణ చెప్పకపోయినా, వీడియోలు డిలీట్ చేయించలేక పోయినా.. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యాయస్థానంలో సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు వేయాల్సి వస్తుందని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు కాంగ్రెస్ నేతలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసుల్లో స్పష్టం చేశారు.