
హైదరాబాద్: మాజీ సిఎం అధికారం చేపట్టాక వచ్చాక కరెంట్ కష్టాలు తీర్చారని, బిఆర్ఎస్ పాలనలో రెప్పపాటు కూడా కరెంట్ పోలేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. మంచి నీటి గోస తీర్చిన ఘనత కెసిఆర్ దే నని కొనియాడారు. ఈ సందర్భంగా మల్కాజిగిరిలో బిఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మల్కాజిగిరిలో మళ్లీ ఎగిరేది బిఆర్ఎస్నజెండానేనని తెలియజేశారు. కల్యాణలక్ష్మి పేరుతో పేదింటి ఆడబిడ్డ పెళ్లికి సాయం అందించారని పేర్కొన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిందని, రెండున్నరేళ్లలో రేవంత్ రెడ్డి రూ.4 లక్షల కోట్ల అప్పు చేశారని, హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతున్నారని విమర్శించారు. ఒక్క మంచి పని చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలని, కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని రేవంత్ అంటున్నారని, కోటీశ్వరులను కాదు.. దమ్ముంటే లక్షాధికారులను చేయాలని సూచించారు.
మహిళలకు నెలకు ఇస్తామన్న రూ. 2,500 హామీ ఏమైందని ప్రశ్నించారు. రేవంత్ మాఫియా నడుపుతున్నారని, సంచుల్లో డబ్బులు ఢిల్లీకి పోతున్నాయని ఎద్దేవా చేశారు. రైతుబంధు అయింది..కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బంద్ పథకం బ్రహ్మాండంగా నడుస్తోందని, రాహుల్ గాంధీ ఖాతాల్లో డబ్బులు బాగా పడుతున్నాయని కెటిఆర్ చురకలంటిచారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పాలనను తిట్టుకోని వాళ్లు లేరని, తులం బంగారం, రైతులకు రూ.15 వేలు ఇస్తామని సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని గ్యారెంటీ కార్డు కూడా ఇచ్చారని చెప్పారు. 100 రోజులు కాదు 900 రోజులు అయిపోయింది హామీలు నెరవేరాయా? అని కెటిఆర్ ప్రశ్నించారు. హామీలు అమలు గురించి రేవంత్ రు అడిగితే నోటికొచ్చినట్లు తిడుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్, బిజెపిని నమ్మలేదని, కాంగ్రెస్ సినిమా ఇంటర్వెల్ అయిపోయిందని, కాంగ్రెస్ పాలన ఫస్ట్ఆఫ్ అట్టర్ ప్లాఫ్ అని కెటిఆర్ ఎద్దేవా చేశారు.









