
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి కు పరిపాలన చేతకావడం లేదని బిఆర్ఎస్ మాజీ మంత్రి వివేకానంద ఆరోపించారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోసపూరిత వాగ్ధానాలతో రేవంత్ ముందుకెళ్తున్నారని, 30 నెలల్లో రూ.12 వేల కోట్ల విలువైన భూములు అమ్మారని విమర్శించారు. హైకోర్టు ఉత్తర్వులు ఉండగా భూములు అమ్మారని, రేవంత్ తెలంగాణ ప్రతిష్టను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మొత్తం భూముల చుట్టే తిరుగుతుందని, హిల్ట్ పాలసీలతో భూములు కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. మూసీ ప్రక్షాళన పేరుతో భూదందా అని ఫోర్త్ సిటీ పేరుతో దందాలు చేస్తున్నారని, రేవంత్ పాలనలో రైతులు నరకయాతన పడుతున్నారని వివేకానంద ఆవేదనవ్యక్తం చేశారు. నిరుద్యోగులను మోసం చేశారని, కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారని, సన్యాసం తీసుకున్న సన్నాసి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, రైతుల విషయంలో ప్రశ్నస్తే సమాధానం లేదని అన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తమపై బురదజల్లుతున్నారని, అన్ని వర్గాలను రేవంత్ మోసం చేశారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెబుతారని వివేకానంద హెచ్చరించారు.










