మన తెలంగాణ/ నాంపల్లి: పకడ్బం దీ వ్యూహం, పక్కా ప్రణాళికతో ప్రత్యర్థులు చేసిన ఓ న్యాయవాది హత్య రా ష్ట్రంలో కలకలం రేకెత్తించింది. వక్ఫ్‌బోర్డు ఆస్తుల వివాదాలు, వాటి పరిరక్షణ కోసం న్యాయపోరాటం చేస్తు న్న న్యాయవాదిని ఎలాగైనా కడతేర్చాలని పథకం పన్నిన ప్రత్యర్థులు ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించా రు. ఉదయం నుంచి రాత్రి వరకు న్యాయవాది కదలికలను కొన్ని రోజులుగా క్షుణ్ణంగా పసిగట్టారు. ఈ మేర కు టార్గెట్ విధించుకొని శనివారం తెల్లవారుజామున 5.45 గంటలకు స్విమ్మింగ్‌కు వెళ్లేందుకు కారెక్కుతుండగా ఖాజా మొయిజుద్దీన్ (63) వెను క నుంచి కారుతో బలంగా ఢీకొట్టా రు. నాంపల్లి పోలీసులు, స్థానికుల క థనం వివరాలు ఇలా ఉన్నాయి.

ఖా జా మొహిజుద్దీన్ ఫిట్‌నెస్ కోసం ప్రతిరోజు ఈత కొట్టడానికి వెళ్తాడు. ఆయన కదలికలను ముందుగానే గమనించిన దుండుగులు ఈ సమయం కోసం నిరీక్షించారు. అక్కడే మాటువేసిన కారు డ్రైవర్ ఆయన తన ఇంట్లో నుంచి బయటికొచ్చి కారు ఎక్కుతుండగా వెనుకనుంచి కారును వేగంగా నడిపి న్యాయవాదిని బలంగా ఢీకొన్నాడు. న్యాయవాది ఎగిరి పడ్డాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలై తీవ్ర రక్త స్రావంతో విలవిలలాడాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ న్యాయవాది మధ్యాహ్నం తుది శ్వాస విడిచాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగానే పక్కా ప్రణాళికతోనే న్యాయవాదిని కారుతో ఢొకొట్టి హతమార్చారని పోలీసులు భావిస్తున్నారు.


అత్యంత విలువైన వక్ఫ్‌బోర్డు ఆస్తుల కోసం చాన్నాళ్లుగా కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నందుకే ఓ కాంగ్రెస్ నాయకుడు తన తండ్రిని కారుతో ఢీకొట్టి కడతేర్చాడని అతని కుమారుడు ఫర్వాన్ ఆరోపించారు. గతంలోనూ తన తండ్రిపై పలుమార్లు దాడులు జరిగాయని గుర్తుచేశారు. ఈ హత్య నేపథ్యంలో తన కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు. అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్‌కుమార్, నాంపల్లి ఇన్‌స్పెక్టర్ సైదులు, ఇతర అధికారులు ఘటనాస్థలికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. న్యాయవాదిని కారుతో ఢీకొట్టి పరారైన దుండుగుడిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కబ్జాదారుల వ్యతిరేకంగా కేసులు వాదిస్తున్నందుకు, పాత కక్షల నేపథ్యంలోనే కుట్రదారులు కుట్ర పన్ని ఖాజా మోహిజుద్దీన్‌ను హతమార్చార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు కుట్ర పన్నినవారిని త్వరలోనే అరెస్టు చేస్తామని నాంపల్లి పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ హత్య పట్ల పలువురు న్యాయవాదులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.