
పూంచ్: జమ్మూ కాశ్మీర్ లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా పూంచ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఇల్లు కూలిపోవడంతో ఏడుగురు మరణించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. లోరాన్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుందని.. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారని చెప్పారు.
కాగా, పూంచ్ జిల్లాలో భారీ వర్షాల ధాటికి పలు చోట్ల ఆకస్మిక వరదలు, మేఘ విస్ఫోటనాలు సంభవించాయి. దీంతో పూంచ్ జిల్లాలో ఇప్పటివరకు సుమారు 17 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. మరో ఆరుగురు వ్యక్తులు గల్లంతు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, గాలింపు కోసం ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు.
సీఎం అబ్దుల్లా ఎక్స్‌గ్రేషియా ప్రకటన
కుండపోత వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయంగా, మరణించిన వారిలో ప్రతి ఒక్కరి కుటుంబానికి రూ. 6 లక్షల పరిహారాన్ని ఆయన ప్రకటించారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నుండి రూ. 4 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి అదనంగా రూ. 2 లక్షలు.. మొత్తం రూ.6 లక్షల చొప్పున బాధిత కుటుంబాలకు అందించనున్నారు.











