
మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి టి. హరీష్ రావు అధికారం కోల్పోయిన అక్కసుతో, తమ రాజకీయ స్వలాభం కోసం అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మండిపడ్డారు. తమ ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేసిందని ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో చెప్పారు. రాష్ట్రంలో 8 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రైతులను రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని ఆయన హరీష్ రావుకు హితవు చెప్పారు.
రైతులను రెచ్చగొట్టేందుకు ధర్నాలు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. కెసిఆర్ ఫాం హౌస్‌లో కూర్చొని రైతులను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఆదుకున్నారా ? అని ఆయన ప్రశ్నించారు. రైతుల రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేశామని ఆయన చెప్పారు. రైతు భరోసా ఇచ్చామని, సన్న బియ్యం పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నామని ఆయన వివరించారు. రైతుల సంక్షేమం చూసి జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. రైతుల వద్ద ఆఖరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ఆయన వివరించారు.












