కీవ్ : రష్యా సోమవారం ఉక్రెయిన్‌పై భీకరస్థాయిలో క్షిపణులు, డ్రోన్ల తో ప్రతీకార దాడికి దిగింది. తమ దేశ చమురు కేంద్రాలపై ఉక్రెయిన్ దాడుల తరువాతి తీవ్ర పరిణామాలతో రష్యా విరుచుకుపడింది. కీవ్ పరిసరాలను ఎంచుకుని సోమవారం నాటి దాడులలో కనీసం 11 మంది పౌరులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డట్లు వెల్లడైంది. ఉక్రెయిన్ వైమానిక భద్రతా వ్యవస్థ పేలవంగా ఉందనే విషయం ఇప్పుడు రష్యా సాగించిన దాడులతో స్పష్టం అయింది. ఈసారి రష్యా ఉక్రెయిన్‌పై దాదాపుగా అన్ని కూడా బాలిస్టిక్ మిస్సైల్స్‌ను ప్రయోగించింది.

ప్రస్తుతం ఉక్రెయిన్‌కు క్షిపణులను తట్టుకుని చిత్తు చేసే పాట్రియాట్ విచ్ఛేదక వ్యవస్థ కొరత ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని రష్యా ఇప్పుడు కీవ్ ఇతర ప్రాంతాలపై అత్యంత శక్తివంతమైన దాడులకు దిగిందని వెల్లడైంది. రష్యా నుంచి ఇక ఎప్పుడైనా అత్యంత తీవ్రస్థాయి దాడులు తప్వవని ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ విశ్లేషించిన కొద్ది గంటల్లోనే దాడులు జరిగాయి. కీవ్‌లో విధ్వంసం జరిగింది. కుప్పకూలిన భవంతులు, దెబ్బతిన్న వాణిజ్య సముదాయాల శిధిలాలను తొలిగించేందుకు సహాయక బృందాలు తరలివచ్చాయి. పలు చోట్ల బాధితుల ఆర్తనాదాలతో పరిస్థితి దారుణంగా మారింది. ఇక రష్యా భీకర దాడుల నుంచి తప్పించుకోవడం , తమను తాము కాపాడుకోవడంపై దృష్టి సారించారు.