బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘కేసీఆర్ క్రికెట్ కప్’ టోర్నీ పోస్టర్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన కేటీఆర్‌ను బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి గత పదేళ్లుగా చేపడుతున్న సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను కేటీఆర్ ప్రశంసించారు. విదేశాల్లో తెలంగాణ సంస్కృతి, ఆత్మగౌరవాన్ని చాటిచెప్పడంలో బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.
అలాగే పార్టీ రజతోత్సవ ఆవిర్భావ వేడుకలను ఈసారి ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిస్తూ, త్వరలోనే ఆస్ట్రేలియా పర్యటనకు వస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో అక్కడి తెలంగాణ ప్రవాసుల్లో ఉత్సాహం నెలకొంది.
ప్రవాస తెలంగాణ సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు, క్రీడాస్ఫూర్తి ద్వారా ఐక్యతను పెంపొందించడమే ఈ టోర్నమెంట్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఆస్ట్రేలియాలో మరింత విస్తృతంగా చాటిచెప్పాలని బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా భావిస్తోంది.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గ్యాదరి బాలమల్లు, మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నంద్యాల దయాకర్ రెడ్డి, బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు రాజేష్ రాపోలు, సాయిరాం ఉప్పు మరియు తదితరులు పాల్గొన్నారు.












