
ఢిల్లీ: కొత్త బొగ్గుబ్లాక్ ల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనకుండా మాజీ సిఎం కెసిఆర్ అడ్డుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆనాడు కెసిఆర్ అవలంభించిన వైఖరి వల్ల సింగరేణికి కొత్త బ్లాక్ లు లేకుండా పోయాయని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్..సింగరేణి వ్యతిరేక విధానాలు అవలంభించారని విమర్శించారు. ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఆనాడే నైనీ కోల్ బ్లాక్ సింగరేణికే దక్కేవని, ఇవాళ కేంద్రం చొరవ తీసుకుని తాడిచర్ల2 కోల్ బ్లాక్ సింగరేణికి దక్కిందని కిషన్ రెడ్డి తెలియజేశారు.
తాడిచర్ల1 కోల్ బ్లాక్ సింగరేణికి దక్కకుండా కెసిఆర్ అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు సింగరేణికి పోటీగా జెన్ కో వేసిన టెండర్ ఉపహరించుకోవాలని, నైనీ, తాడిచర్ల2, నికెవొసి బ్లాక్ లు సింగరేణికి దక్కితే సంస్థ లాభపడుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మూడు కోల్ బ్లాక్ లు సింగరేణికి దక్కితే 6,500 మందికి ఉపాధి లభిస్తుందని, మూడు కోల్ బ్లాక్ ల ద్వారా సింగరేణికి రూ.1.95 లక్షల కోట్ల టర్రోవర్ వస్తుందని అన్నారు. పరీక్షల అక్రమాలకు నిరోధక బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిందని, చాలా కఠినమైన కొత్త చట్టాన్నిప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని చెప్పారు. అన్ని పార్టీలు కొత్త బిల్లుకు మద్దతు తెలపాలని..మంచి సూచనలు కిషన్ రెడ్డి ఇవ్వాలని కోరారు.











