
హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి విలువ లేకుండా చేశారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాజ్యసభలో బిజెపి నేతలను ప్రశ్నిస్తుందనే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించారని అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ‘సర్’ పై బిఎల్ ఎలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ‘సర్’పై బిఎల్ఎల శిక్షణ కార్యక్రమానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. దేశానికి చక్రవర్తులమనే భావనలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఉన్నారని తెలియజేశారు. పదేళ్లు దోపిడీ చేసి..ఇప్పుడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, బిఆర్ఎస్ దోపిడీని ప్రజలు మరిచిపోయారని కెటిఆర్ అనుకుంటున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కెటిఆర్ ఎన్ని మాయమాటలు చెప్పినా.. ప్రజలు వినే పరిస్థితి లేదని, ఆస్తి కోసం సొంత చెల్లినే బయటకు గెంటేసిన చరిత్ర కెటిఆర్ ది అని చెల్లిని గెంటేసి ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డల గురించి కెటిఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని, అధికారం పోయిందనే అక్కసు కెటిఆర్ లో కనిపిస్తోందని ధ్వజమెత్తారు. తమ పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా చూస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.









